మైసూర్ చాముండేశ్వరి

పురాణాలను పరిశీలిస్తే పరమశివుడి మనసు కూడా మంచుకొండేనని తెలుస్తుంది. ఎందుకంటే శివుడు తన గురించి తపస్సు చేసిన రాక్షసులకు సైతం కోరిన వరాలను ప్రసాదిస్తూ వెళ్లాడు. ఆ వరాల వలన సాధుజనుల జీవితాలు ప్రమాదంలో పడినప్పుడు శ్రీ మహావిష్ణువు తెలివిగా ఆ రాక్షసుల ఆటకట్టిస్తూ వచ్చాడు. లోక కంటకుడైన మహిషాసురుడి విషయంలోనూ ఇదే జరిగింది.

దున్నపోతు తల ... మానవ దేహంగల మహిషాసురుడు, త్రిమూర్తుల చేతిలో గానీ, ప్రస్తుతమున్న ఏశక్తి చేతిలోగాని తనకి మరణమనేది లేకుండా శివుడి నుంచి వరాన్ని పొందాడు. ఆ వర గర్వంతో ముల్లోకాలపై విరుచుకు పడ్డాడు. దాంతో మహిషాసురుడు కోరిన వరం గురించి ఆలోచన చేసిన విష్ణుమూర్తి, త్రిమూర్తుల తేజస్సు నుంచి ఒక కొత్త శక్తిగా 'దుర్గ' ఉద్భవించేలా చేశాడు. అనేక శక్తుల కలయికతో ఆవిర్భవించిన దుర్గ, మహిషాసురుడిని సంహరించింది.

కాలక్రమంలో ఈ సంఘటన గురించి తెలుసుకున్న విక్రమాదిత్య మహారాజు ... ఇక్కడి 'మహాబలగిరి' పై చాముండేశ్వరి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ రోజు నుంచి 'మహిషాసుర పురం' ... మైసూరుగా మారింది ... చాముండేశ్వరి మైసూరు పాలకుల ఇలవేల్పు అయింది. ఆ తరువాత 'శామరాజ ఉడైయార్' పాలనా కాలంలో ఆయన ఒకసారి అమ్మవారి దర్శనానికి వెళ్లినప్పుడు హఠాత్తుగా గాలి వాన మొదలైంది.

దేవాలయానికి కాస్త దూరంలో ఓ చెట్టుకింద పల్లకి దిగిన ఆయనని అక్కడి వాతావరణం కలవర పరిచింది. అమ్మవారి దర్శనం చేసుకోవలసిందే అన్నట్టుగా ఆయన ఆలయం వైపు నడిచాడు. ఆయన అలా కొంత దూరం వెళ్లగానే ... అప్పటి వరకూ ఆయన నుంచున్న చెట్టుపై పిడుగు పడింది. తనని రక్షించిన అమ్మవారికి ఆయన సాష్టాంగ నమస్కారం చేశాడు. తన ప్రాణాలు కాపాడిన అమ్మవారికి అత్యంత వైభవంగా ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పుడిది మైసూర్ మహా నగరానికే తలమానికంగా కనిపిస్తూ వుంటుంది. ఇక దేశంలోనే అత్యంత ఘనంగా ఇక్కడ దసరా వేడుకలు నిర్వహించబడుతుంటాయి.


More Bhakti News