మహాబలిపురం

ఒక వైపున చారిత్రక వైభవం ... మరో వైపున ఆధ్యాత్మిక సంపద ... ఈ రెండూ కలగలిసిన క్షేత్రమే 'మహాబలిపురం'. పూర్వం 'మహాబలి' అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించడం వలన దీనికి మహాబలిపురమనే పేరు వచ్చిందని అంటారు. ఈ క్షేత్రానికి సంబంధించి ప్రధానంగా పల్లవుల పేరు వినిపిస్తున్నప్పటికీ, వారి రాకకు మునుపే ఈ ప్రాంతం సుప్రసిద్ధమైన ఓడరేవుగా విలసిల్లిందని ఆధారాలు చెబుతున్నాయి.

7 వ శతాబ్దానికి చెందిన పల్లవరాజు నరసింహ వర్మ, జనరంజకమైన పాలనను అందించాడు. మహాబలిపురంలో అద్భుతమైన కట్టడాలను చేపట్టి 'పల్లవ మల్ల' అనే బిరుదును పొందాడు. ఆయన పేరు మీద ఈ ప్రాంతాన్ని మా'మల్ల'పురంగా కూడా పిలుస్తుంటారు. చెన్నై సమీపంలో గల ఈ క్షేత్రంలో వరాహ స్వామి గుహ ... మహిషాసుర మర్ధని గుహ ... పంచపాండవుల రథాలు ... పాశుపతాస్త్రం కోసం అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం ... షోర్ టెంపుల్ ... నయనమనోహరంగా దర్శనమిస్తాయి ... నాటి శిల్పకళా నైపుణ్యంతో ఆశ్చర్య పరుస్తూనే అలౌకికమైన ఆనందానుభూతులను కలిగిస్తాయి.

ఇక్కడి ఆలయంలో లింగ రూపంలో శివుడు ... నేలపైనే శయనిస్తూ విష్ణుమూర్తి దర్శనమిస్తుంటారు. ఆది శేషుడిపైన కాకుండా నేలపై పడుకుని వున్న కారణంగా విష్ణుమూర్తిని 'స్థల శయన పెరుమాళ్' గా పిలుస్తూ వుంటారు. మహాకవి 'దండి' ఇక్కడి స్వామివారి అనుగ్రహాన్ని పొందినట్టుగా చరిత్ర చెబుతోంది. అందమైన ప్రకృతి ... ఆహ్లాదకరమైన వాతావరణం నేపథ్యంగా గల ఈ క్షేత్రాన్ని దర్శించడం మనసున్నంత వరకూ మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.


More Bhakti News