శుచీంద్రం

ఇటు శైవులు ... అటు వైష్ణవులు పరమ పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రం 'శుచీంద్రం'. ప్రాచీన కాలంనాటి ఈ పుణ్యక్షేత్రం 'కన్యాకుమారి'కి సమీపంలో విరాజిల్లుతోంది. తన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికిగాను, పరమేశ్వరుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ దేవేంద్రుడు తపస్సు చేసిన ప్రదేశం ఇది. ఇంద్రుడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆయనను అనుగ్రహించాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

ఈ క్షేత్రంలో శివుడితో పాటుగా బ్రహ్మ .. విష్ణులు కూడా దర్శనమిస్తుంటారు. ఈ ముగ్గురూ ఒకే రూపంగా దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. ఇలా త్రిమూర్తులు ఒకే రూపాన్ని కలిగి ఉండటాన్ని 'ధర్మ సంవర్ధని' అని అంటారు. ఇక ఆలయ ప్రాంగణంలో 18 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి విశ్వరూప విగ్రహం దర్శనమిస్తుంది. అశోక వనంలో సీతమ్మ వారికి హనుమంతుడు చూపిన విశ్వరూపంగా దీనిని చెబుతారు.

ఈ క్షేత్రంలోని కొన్ని ఆలయ భాగాలు క్రీ.పూ. 947 కి పూర్వం నిర్మించబడినట్టుగా శాసనాధారాలు కనిపిస్తున్నాయి. ఆ తరువాత కాలంలో పాండ్య ... చోళ రాజులు ఆలయ అభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషించారు. ఎత్తయిన గోపురాలు ... పొడవైన ప్రాకారాలతో అడుగడుగునా అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతుంటుంది.

సాధారణంగా నవగ్రహాలు ఒక వేదికపై కొలువుదీరి కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక మంటపం పై భాగంలో నవగ్రహాలు చెక్కబడ్డాయి. భక్తులు పై కప్పు వైపు చూస్తూనే వాటిని దర్శించుకుంటూ వుంటారు. ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేయడం వలన శారీరక ... మానసిక పరమైన వ్యాధుల బారి నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News