రామకోటి

సమస్త పాపాలను హరించివేసి ... సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక్క రామ నామానికి మాత్రమే వుంది. రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి ... మోక్షమార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి. దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడూ రాముడేననిపిస్తుంది. దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా వుంటుంది.

శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నింటి గురించి కొంతమందికి తెలియక పోవచ్చునేమో గానీ, రామావతారం గురించి తెలియని వారు వుండరు. అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు ... మది మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు. అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం 'రామకోటి' రాసేవారు. ఇలా రాసినవి ఆయా దేవాలయాలోని రామకోటి స్తంభాల్లో నిక్షిప్తం చేసేవారు.

జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖ్య తగ్గిందే గాని, పూర్తిగా కనుమరుగు కాలేదు. రామకోటి రాయడానికి ప్రతి రోజు ఒక సమయం పెట్టుకుని, తూర్పు దిశగా కూర్చుని రాయాలి. ప్రతి రోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి. అనుకున్నన్ని సార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక, 'శ్రీ రామ శరణంమమ' అనే అష్టాక్షరీ మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి. శుచిగా లేని సమయాల్లోను ... మైల సమయాల్లోనూ రామకోటి రాయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.


More Bhakti News