దేవతా వాహనాలు

దేవుడు ఒకడే అయినా ఆయన అనేక రూపాల్లో పూజలు అందుకుంటూ ఉంటాడు. వివిధ క్షేత్రాల్లో కొలువుదీరిన దైవాలకి వార్షి కోత్సవాలు ... కళ్యాణోత్సవాలు ... బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ సందర్భాల్లో ఉత్సవ మూర్తులను ఒక్కోరోజు ఒక్కో వాహనంపై ఊరేగిస్తూ వుంటారు. విష్ణువుకి ... శివుడికి ... శక్తికి నిర్దేశించబడిన వాహనాలు వేరు వేరుగా వుంటాయి. ఆగమ శాస్త్రం ప్రకారం జరిపే ఈ ఉత్సవాల్లో ప్రధాన వాహనం పైనే కాకుండా ఇతర వాహనాలపై ఊరేగే దైవాలని వీక్షించి తరించడానికి భక్తులు విశేష సంఖ్యలో తరలి వస్తుంటారు.

ఏయే దైవాలకి ఎవరు ఎందుకు వాహనాలుగా మారారనేది పురాణాలలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక విష్ణుమూర్తి వాహనం 'గరుడ పక్షి' అయితే లక్ష్మీదేవి వాహనంగా 'గుడ్లగూబ' కనిపిస్తుంది. శివుడి వాహనంగా 'నంది ... పార్వతి' వాహనంగా 'సింహం' ... వినాయకుడి వాహనంగా ఎలుక ... కుమార స్వామి వాహనంగా 'నెమలి' కనిపిస్తాయి. బ్రహ్మ - సరస్వతి వాహనంగా 'హంస' ... సూర్యుడి వాహనంగా 'ఏడు గుర్రాల రథం' ... చంద్రుడి వాహనంగా 'లేడి' ... శని వాహనంగా 'కాకి' దర్శనమిస్తాయి.

ఇంద్రుడి వాహనంగా 'ఏనుగు' ... హనుమంతుడి వాహనంగా 'ఒంటె' యముడి వాహనంగా 'మహిషము' కనిపిస్తాయి. దుర్గాదేవి వాహనంగా 'పెద్దపులి' ... గంగ వాహనంగా 'మొసలి' ... యమున వాహనంగా 'తాబేలు' ... రతీ మన్మథుల వాహనంగా 'చిలుక' దర్శనమిస్తాయి. ఆయా వాహనాలు భక్తుల చెంతకే భగవంతుడిని తీసుకు వస్తూ, వారికి నయనానందాన్ని కలిగిస్తూ వుంటాయి. ఉత్సవాల్లో ఉత్సాహాన్ని నింపుతూ, మోక్షమార్గాన మొదటి మెట్టును ఎక్కిస్తుంటాయి.


More Bhakti News