అట్లతద్ది

కన్నెపిల్లలు తమకి అందమైన యువకుడు భర్తగా లభించాలనే ఉద్దేశంతో చేసే వ్రతంగా 'అట్లతద్ది' వ్రతం ప్రసిద్ధి చెందింది. ఆశ్వీయుజ బహుళ తదియ రోజున ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. విదియ రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి చేతి వ్రేళ్లకు ... కాళ్ల వ్రేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. ఇక తదియ రోజున ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి కొత్తబట్టలు కట్టుకుని చద్ది అన్నం తింటారు. తాంబూలం వేసుకుని ఊయలలు ఊగుతారు. నోరు బాగా పండితే ఎంతగానో ప్రేమించే మంచి భర్త లభిస్తాడని విశ్వసిస్తారు.

ఇక సాయంత్రం చంద్రోదయం కాగానే, పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకుని పార్వతీ దేవిని పూజిస్తారు. అట్లతద్ది వ్రతకథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకుని, ఆ తరువాత చంద్రుడికి నమస్కరించి ముత్తయిదువులతో కలిసి అట్లను ఆరగిస్తారు. తదియ రోజున అట్లను ఆరగించడం వలన అట్ల తదియ అనీ ... చంద్రుడు కనిపించాక పార్వతీ దేవి పూజ ప్రారంభించడం వలన చంద్రోదయ ఉమావ్రతం అని అంటూ వుంటారు.

ఇక ఈ రోజున ''అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ... ముద్దపప్పోయ్ మూడట్లోయ్'' అంటూ కన్నె పిల్లలు ఊయలలూగుతూ పాడుకోవడమనే సంప్రదాయం ఇప్పటికీ కొన్ని పల్లె ప్రాంతాల్లో కనిపిస్తూ వుంటుంది. పల్లె ప్రాంతాల్లో ఊయలలు ఊగుతూ జరుపుకునే పండుగ కావడం వలన దీనికి 'ఊయల పండుగ' అనే పేరు కూడా వుంది. అందగాడైన యువకుడు భర్తగా లభించాలని ఈ వ్రతాన్ని కన్యలు చేయగా, వివాహితులు తమ భర్తల ఆరోగ్యాన్ని ఆశించి ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వుంటారు.


More Bhakti News