పూరీ క్షేత్రంలో రథాలు .. పేర్లు .. సారథులు

భగవంతుడి రథయాత్ర అత్యంత వైభవంగా జరిగే క్షేత్రాల్లో .. పూరీ ముందువరుసలో కనిపిస్తుంది. ఇక్కడి జగన్నాథ స్వామికి ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ ద్వితీయ రోజున రథయాత్ర మొదలవుతుంది. లక్షలాదిమంది భక్తులు పాల్గొనే ఈ రథయాత్రను చూసితీరవలసిందే. శ్రీకృష్ణుడు .. బలభద్రుడు .. సుభద్ర మూర్తులు చెక్కతో మలచినవి కావడం విశేషం. ఇక ఈ మూర్తులను ఊరేగించే రథాలను కూడా ఎప్పటికప్పుడు 'మద్ది చెక్క'తో చేస్తుంటారు.

జగన్నాథస్వామిని ఊరేగించే రథం పేరు 'నంది ఘోష'. ఇది ఎరుపురంగును .. 45 అడుగుల ఎత్తు .. 16 చక్రాలను కలిగి ఉంటుంది. ఈ రథానికి 'మాతలి' సారథిగా ఉంటాడని అంటారు. బలభద్రుడి రథమును 'తాల ధ్వజం' పేరుతో పిలుస్తారు .. ఇది 14 చక్రాలను కలిగి వుంటుంది. ఆకుపచ్చ రంగును .. 44 అడుగుల ఎత్తును .. 'దారుకుడు' అనే సారథిని కలిగి ఉంటుందని చెబుతారు. ఇక సుభద్ర రథానికి 'దర్పదళనం' అని పేరు .. ఈ రథానికి 12 చక్రాలుంటాయి. ఎరుపు రంగును .. 43 అడుగుల ఎత్తును కలిగిన ఈ రథానికి సారథి 'అర్జునుడు' అంటారు. ఈ రథోత్సవంలో పాల్గొన్నవారి సమస్త పాపాలు తొలగిపోయి .. సకల శుభాలు కలుగుతాయని భక్తులు బలంగా విశ్వసిస్తుంటారు.       


More Bhakti News