ఆషాఢ శుద్ధ ఏకాదశి విశిష్టత

ఆషాఢ శుద్ధ ఏకాదశిని 'తొలి ఏకాదశి' అంటారు .. ఈ రోజున శ్రీమహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కనుక 'శయన ఏకాదశి' అని కూడా అంటారు. ఈ రోజు నుంచే 'చాతుర్మాస్య వ్రతం' ప్రారంభమవుతుంది. ఈ రోజున శయన విష్ణుమూర్తి కొలువైన క్షేత్రాలను దర్శించడం మరింత మంచిదనేది మహర్షుల మాట. ఈ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను చేపట్టి .. స్వామివారి భజనలతో జాగరణ చేసి .. ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. ఈ రోజున నెయ్యితో చేసిన పిండివంటలు .. చక్రపొంగలి .. పేలాలు పిండి .. వెన్న మీగడలు .. స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాలుగా చెబుతారు.

పూర్వం ఈ ఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు .. అంబరీషుడు .. భీష్ముడు ఆచరించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ వ్రత మహాత్మ్యం వలన సమస్త పాపాలు .. దోషాలు తొలగిపోతాయని స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా 'పండరీపురం'లో పాండురంగస్వామికి వైభవంగా ఉత్సవాలు జరుపుతుంటారు. ఈ రోజున స్వామి వారిని  లక్షలాదిగా భక్తులు దర్శించుకుంటూ వుంటారు. పాండురంగస్వామి భజనలతో ఈ రోజున పండరీపురం మారుమ్రోగుతూ ఉంటుంది. నామదేవుడు .. జ్ఞానదేవుడు .. తుకారామ్ .. చోఖమేళా .. సక్కుబాయి .. జనాబాయి వంటి ఎంతోమంది భక్తులు ఆ పాండురంగడిని పూజించినవారే .. ఆయన నామ స్మరణ చేత తరించినవారే.         


More Bhakti News