ద్రౌపదిచే పూజించబడిన సూర్యభగవానుడు

జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. కాశీ క్షేత్రాన్ని దర్శించిన వారు .. అక్కడి సూర్యదేవాలయాలను కూడా తప్పక దర్శిస్తూ వుంటారు. కాశీ క్షేత్రంలో 12 సూర్యదేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కోచోట ఒక్కో పేరుతో కొలవబడుతూ .. సూర్యభగవానుడు ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఒక్కో ఆసక్తికరమైన కథనం వినిపిస్తూ ఉంటుంది. అలా ఇక్కడి 12 ఆలయాలలో ఒకటిగా 'ద్రౌపద్యాదిత్యుడు'గా సూర్యభగవానుడు పిలవబడే ఆలయం కనిపిస్తుంది.

పాండవులు అరణ్యవాస సమయంలో ఆకలిదప్పులతో అలమటించారు. అలాంటి పరిస్థితుల్లోనే వాళ్లు ఇక్కడికి చేరుకున్నారు. ద్రౌపది ఇక్కడ సూర్యభగవానుడి మూర్తిని ప్రతిష్ఠించి పూజించడం వలన ఆకలిదప్పుల నుంచి విముక్తి లభించిందని అంటారు. ద్రౌపదిచే పూజించబడిన కారణంగానే స్వామి 'ద్రౌపద్యాదిత్యుడు'గా పిలవబడుతున్నాడు. ఇక్కడి స్వామివారిని దర్శించినవారికి జీవితాంతం ఆకలి బాధలు ఉండవనే విశ్వాసం ఇప్పటికీ వుంది. ఈ ద్రౌపద్యాదిత్యుడినే ధర్మరాజు ఉపాసించి .. ఆ స్వామి నుంచి 'అక్షయపాత్ర'ను వరంగా పొందినట్టు స్కాందపురాణంలోని 'కాశీఖండం' చెబుతోంది.      


More Bhakti News