పరమేశ్వరుడే సిద్ధుడిగా వచ్చిన వేళ

పూర్వం 'మధురై'ను అభిషేక పాండ్యుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. తాను చాలా గొప్పవాడిననీ .. మధురై ప్రజలను పోషిస్తున్నది తానేననే అహంభావం ఆయనలో ఉండేది. ఒక రోజున ఆయన మీనాక్షి దేవాలయానికి వెళతాడు. ఆ సమయంలోనే ఆయనకి అక్కడ ఒక సిద్ధుడు కనిపిస్తాడు. తన వలన సాయమేదైనా కావాలంటే అడగమని రాజు ఆ సిద్ధుడితో అంటాడు. తనకి ఎవరూ ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, మధురై ప్రజలకు కావలసినదేమిటో తానే ఇవ్వాలనుకుంటున్నానని ఆ సిద్ధుడు సమాధానమిస్తాడు.

రాజు అహం దెబ్బతినడంతో, ఆ సిద్ధుడి శక్తిని పరీక్షించాలనుకుంటాడు. భటుడిని పిలిచి చెరుకు గడ ఒకటి తీసుకురమ్మని చెబుతాడు. ఆ భటుడు తీసుకొచ్చిన చెరుకు గడను సిద్ధుడికి ఇచ్చి, అక్కడున్న రాతి ఏనుగుతో ఆ చెరుకును తినిపించమని అంటాడు. ఆ సిద్ధుడు చెరుకు గడను రాతి ఏనుగు ముందుంచగానే ఆ ఏనుగులో కదలిక మొదలవుతుంది. ప్రాణం పోసుకున్న ఆ రాతి ఏనుగు చెరుకును తినేస్తుంది. అది చూసిన రాజు ఆశ్చర్యపోయి .. తనని మన్నించమని కోరతాడు. అప్పుడు  ఆ సిద్ధుడు పరమేశ్వరుడిగా నిజరూపాన్ని పొందుతాడు. రాజులోని అహంభావాన్ని తొలగించడానికే అలా చేశానని చెప్పి అదృశ్యమవుతాడు.            


More Bhakti News