మంచి చేసే కోరికలనే భగవంతుడు నెరవేర్చుతాడు

మనసనేది కోరికల పుట్టలాంటిది .. దానిని అదుపులో ఉంచలేకపోతే అది అన్ని వైపులకు పరుగులు తీయిస్తూ ఉంటుంది. కోరికలకు అంతమనేదే వుండదు .. ఒకటి తీరగానే దాని స్థానంలో మరొకటి పుట్టుకొస్తూనే ఉంటుంది. అలాంటి కోరికలను త్వరగా తీర్చుకోవడం కోసం భగవంతుడిని ఆశ్రయించేవారు ఎక్కువగానే కనిపిస్తూ వుంటారు. ఏ దైవానికైతే ఫలానా కోరికను నెరవేర్చమని చెప్పుకుంటారో, ఆ దైవం ఆ కోరికను నెరవేర్చకపోతే నిరాశా నిస్పృహలకు లోనవుతుంటారు. దేవుడు తమపట్ల ప్రేమను చూపలేకపోయాడని నిరసనను తెలియజేస్తారు.

 కానీ ఎవరికి ఏది అవసరమో .. ఎంతవరకూ అవసరమో అంతవరకే భగవంతుడు అందజేస్తూ ఉంటాడు. ఏ కోరిక తీర్చడం వలన ఎంతవరకూ మంచి జరుగుతుందో చూసుకునే ఆయన అది నెరవేరేలా చేస్తాడు. ఫలానా కోరికను నెరవేర్చడం వలన మంచి జరగదనే విషయం ఆయనకి తెలుస్తుంది కనుక .. అక్కడ ఆయన మౌనంగానే ఉండిపోతాడు. ఎవరికి ఏం కావాలనేది .. ఏ సమయానికి అది వాళ్లకి చేరాలనేది దైవానికి తెలుసు. ఆయన మౌనంలోని అనంతమైన ప్రేమను అర్థం చేసుకోవాలేగానీ, నింద చేయకూడదు .. నిరసనలు తెలుపకూడదు. 


More Bhakti News