శాంతదుర్గ ఆలయం ప్రత్యేకత అదే

లోక కల్యాణం కోసం దుర్గాదేవి అసుర సంహారం చేస్తూ వచ్చింది కనుక, ఆ తల్లి ఉగ్రరూపంలోనే ఎక్కువ క్షేత్రాల్లో దర్శనమిస్తూ ఉంటుంది. తన భక్తుల జోలికి వచ్చే అసురుల విషయంలోనే అమ్మవారు అలా ఆగ్రహంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. చాలా క్షేత్రాల్లో ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చే అమ్మవారు, 'గోవా'లో మాత్రం శాంతమూర్తిగా కొలువై ఉంటుంది. ఇక్కడి అమ్మవారు ప్రశాంత వదనంతో పూజలు అందుకుంటూ .. భక్తులపై కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తూ ఉంటుంది.

 ఇలా అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించడానికి వెనుక స్థలపురాణంగా ఒక కథనం వినిపిస్తూ ఉంటుంది. పూర్వం శ్రీమహా విష్ణువుకి .. శివుడికి మధ్య వాగ్వాదం మొదలైందట. ఇక వాళ్లిద్దరూ యుద్ధానికి సిద్ధమవుతూ ఉండటంతో .. దుర్గాదేవి వచ్చి వారిని శాంతిపజేసిందని అంటారు. అందుకు నిదర్శనంగా ఈ క్షేత్రంలో శాంతదుర్గకి ఒక వైపున శ్రీమహా విష్ణువు .. మరో వైపున శివుడు దర్శనమిస్తూ వుంటారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడం వలన ఆపదలు .. అనారోగ్యాలు తొలగిపోయి, విజయాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.        


More Bhakti News