వ్యాస మహర్షికి ప్రత్యక్షమైన లక్ష్మీపతిస్వామి

కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలోని లక్ష్మీనారాయణుల క్షేత్రాల్లో 'పెద ముక్తేవి' ఒకటిగా కనిపిస్తుంది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం పరిథిలో ఈ క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది. పూర్వం వ్యాస మహర్షి ఈ ప్రదేశంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని .. శ్రీమహా విష్ణువు కోసం తపస్సు చేశాడట. దాంతో స్వామి లక్ష్మీ సమేతుడై ఇక్కడ ఆవిర్భవించాడని  స్థల పురాణం చెబుతోంది. అందువలన ఇక్కడ స్వామి 'లక్ష్మీపతి'గా కొలవబడుతూ ఉంటాడు.

లక్ష్మీదేవి వామ భాగాన ఉండగా .. చతుర్భుజాలతో స్వామివారు దర్శనమిస్తూ ఉంటాడు. అమ్మవారితో కలిసి పానవట్టం వంటి ఒక వేదికపై స్వామివారు ఆసీనుడై ఉండటం ..  క్షేత్ర పాలకుడిగా వినాయకుడు కొలువై ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకతగా చెబుతూ వుంటారు. దృష్టి మళ్లించుకోలేనంత సౌందర్యంతో ఇక్కడి స్వామివారు కొలువై .. భక్తుల మనోఫలకంపై తన రూపాన్ని ముద్రిస్తూ ఉంటాడు. అత్యంత ప్రాచీనమైన .. మహిమాన్వితమైన ఈ క్షేత్ర దర్శనం వలన, సమస్త పాపాలు నశించి .. సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. 


More Bhakti News