పాండవులు పూరించిన శంఖాలు

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ధరించడం వలన శంఖం అత్యంత పవిత్రమైనదనీ .. ఎంతో శక్తిమంతమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. శంఖాలలో దక్షిణావృత శంఖాలు మరింత విశేషమైనవిగా చెబుతారు. ఇక 'శంఖం' సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమనీ .. అందుకే శ్రీమన్నారాయణుడికి అది అంత ప్రీతికరమైనది కూడా అంటారు. శంఖం అంత పవిత్రమైనది కనుకనే .. శంఖ జలమే తీర్థమనేది మహర్షుల మాట.

శంఖు తీర్థంతోనే భగవంతుడికి అభిషేకాలు చేస్తుంటారు. పూజా మందిరాల్లో దక్షిణావృత శంఖం ఉంచుతుంటారు .. మరి కొంతమంది పూజా సమయంలో శంఖం ఊదుతుంటారు. ఎక్కడికైనా బయల్దేరుతున్నవారు .. శంఖ ధ్వనిని శుభ సూచకంగా భావిస్తుంటారు. ఇలా ప్రాచీన కాలం నుంచి కూడా శంఖం ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడితో పాటు పాండవులు కూడా శంఖాలను ఉపయోగించారు. వారి శంఖాలకి పేర్లు కూడా ఉండేవనేది ఆధ్యాత్మిక గ్రంధాల వలన తెలుస్తోంది. శ్రీకృష్ణుడు 'పాంచజన్యం' .. ధర్మరాజు 'అనంత విజయం' .. భీముడు 'పౌండ్రకమ్' .. అర్జునుడు 'దేవదత్తం' .. నకులుడు 'సుఘోషం'.. సహదేవుడు 'మణిపుష్పకం' అనే శంఖాలను ఉపయోగించారు.    


More Bhakti News