శ్రీకాళహస్తి

'శ్రీ' అంటే సాలె పురుగు ... 'కాళము' అంటే పాము ... 'హస్తి' అంటే ఏనుగు. ఈ మూడూ కూడా సదాశివుడిని భక్తితో కొలిచి మోక్షాన్ని పొందిన ప్రదేశమే 'శ్రీ కాళహస్తి'. ఇది సువర్ణముఖీ నదీ తీరంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమై వెలుగొందుతోంది.

ఇక దైవానికి చేరువ కావాలన్నా ... దైవ సాక్షాత్కారం లభించాలన్నా ఎలాంటి పాండిత్యం గానీ, శాస్త్ర పరిజ్ఞానం అవసరం లేదని నిరూపించిన 'తిన్నడు'(భక్త కన్నప్ప) కథ ఇక్కడ జరిగినదే. భగవంతుడి పరీక్షకి ఎదురు నిలిచి తన రెండు కళ్ళను అర్పించి కన్నప్ప గా చరిత్రలో నిలిచిపోయాడు. నిండైన ... నిర్మలమైన ... నిస్వార్ధమైన భక్తి వుంటే, పరమాత్ముడి మనసు గెలుచుకోవచ్చునని భక్త కన్నప్ప జీవితం చాటిచెబుతుంది.

తిరుపతి సమీపంలో వెలసిన ఈ క్షేత్రంలో స్వామివారు పంచభూత లింగాలలో ఒకటైన 'వాయులింగం'గా దర్శనమిస్తుంటాడు. స్వామివారు శ్రీ కాళ హస్తీశ్వరుడిగా ... అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబగా భక్తులను అనుగ్రహిస్తుంటారు. ఇక్కడి ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించినట్టుగా స్థల పురాణం చెబుతోంది. తరువాత కాలంలో ఎందరో రాజులు ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు.

ఇక్కడ పాతాళ వినాయకుడిని తప్పక దర్శించాలి. అలాగే భక్త కన్నప్ప ఆలయానికి వెళితే దైవంపట్ల ప్రేమ ... విశ్వాసం ఏ స్థాయిలో ఉండాలనేది స్పష్టమవుతుంది. మహా శివరాత్రి రోజున ఇక్కడ జరిగే ఉత్సవాన్ని తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు ... భక్తిభావ పరిమళాలను ఆస్వాదిస్తూ వుంటారు.


More Bhakti News