ధనుష్కోటిలో దానం .. కోటి రెట్లు ఫలం

రామాయణం చదవాలనే ఆసక్తి .. ఆయా సంఘటనలకు సంబంధించిన ప్రదేశాలను చూడాలనే ఉత్సాహం చాలామందికి కలుగుతూ ఉంటుంది. పుణ్య క్షేత్రాలుగా వెలుగొందుతోన్న ఆ ప్రదేశాలను దర్శించడం వలన, సమస్త దోషాలు నశించి సకల పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి పుణ్య క్షేత్రాలలో 'రామేశ్వరం' ముఖ్యమైనదిగా కనిపిస్తుంది. రామేశ్వరంలో చూడవలసిన ప్రదేశాలలో 'గంధమాదన పర్వతం' ఒకటి కాగా, 'ధనుష్కోటి' మరొకటిగా చెప్పుకోవాలి.

రావణుడిని సంహరించిన శ్రీరామచంద్రుడు .. బ్రహ్మ హత్యా దోషం పోవడానికి గాను, ఇక్కడి పర్వతంపై కూర్చుని ధ్యానం చేసుకోవడమే కాకుండా రామలింగ ప్రతిష్ఠ చేశాడు. ఇక్కడ శ్రీరామచంద్రుడి పాద ముద్రలు కూడా దర్శనమిస్తాయి. అందువలన భక్తులు సంఖ్య అధికంగానే ఉంటుంది. ఇక శ్రీరామచంద్రుడిని విభీషణుడు శరణువేడిన ప్రదేశమే 'ధనుష్కోటి'. ఇక్కడే తాత్కాలికంగా విభీషణుడికి పట్టాభిషేకం జరిగిందని కూడా అంటారు. ఈ ప్రదేశంలో శక్తి కొలది దానం చేయాలనీ చెబుతారు. ఏ దానం చేసినా అది కోటిరెట్ల ఫలాన్ని ఇస్తుందని చెబుతారు. అందువలన రామేశ్వరం వెళ్లిన భక్తులు ఈ ప్రదేశంలో తప్పకుండా దానాలు చేస్తుంటారు. రామ నామ స్మరణ చేస్తూ ధన్యులవుతుంటారు.   


More Bhakti News