విధిని ఎవరూ తప్పించలేరు

"ఎలా జరగాల్సి వుంటే అలా జరుగుతుంది" .. " విధి రాతను విష్ణుమూర్తి కూడా తప్పించుకోలేడు" అనే మాటలను పెద్దల నోటివెంట వింటూ ఉంటాం. ఎవరి విషయంలోనైనా .. ఏ విషయంలోనైనా విధి ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. దేవతలు .. మహర్షులు .. సాధారణ మానవులు ఎవరైనా సరే దీనికి అతీతులు కారు. ఇందుకు నిదర్శనంగా రామాయణంలోని ఒక ఉదాహరణని చెప్పుకోవచ్చు.

 శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అంతా సంతోషంగా .. సంబరంగా వున్నారు. అలాంటి సమయంలో 'కైకేయి' చెవిన మంధర మాయమాటలు వేసింది. అంతే .. అంతా అస్తవ్యస్తమైపోయింది. శ్రీరాముడు సతీ సమేతుడై అడవులకు వెళ్లవలసి వచ్చింది. అనుకోని ఈ సంఘటన అందరినీ దుఃఖసాగరంలో ముంచేసింది. శ్రీరాముడు మాత్రం బాధపడలేదు .. తండ్రి ఆజ్ఞ మేరకు ఆయన అడవులకు బయలుదేరాడు. 'విధి' ఎంత బలీయమైనదో ఆయనకి తెలుసు .. దానిని తప్పించడం ఎవరి వలన కాదని తెలుసు. విధి చేసే పనుల వెనుక ఏదో ప్రయోజనం ఉంటుందనీ తెలుసు. అందుకే ఆయన విధి నిర్ణయానికి అనుగుణంగా నడచుకుని లోకానికి ఆదర్శప్రాయుడైనాడు.    


More Bhakti News