మహాకాలేశ్వర

జ్యోతిర్లింగాలలో మూడవదిగా ఉజ్జయిని మహా కాలేశ్వరుడు కనిపిస్తాడు. ఇటు పురాణాలలోను ... అటు ప్రాచీన కథా వస్తువులలోను ఉజ్జయిని అనే పేరు ప్రధానంగా వినిపిస్తూ వుంటుంది. ఉజ్జయిని నగరానికి అవంతీ నగరమనే పేరు కూడా వుంది. ఇక ఈ ప్రాంతానికి పూర్వనామంగా 'మహాకాలవనం' కనిపిస్తుంది. భూమధ్య రేఖ ఈ నగరం మధ్య భాగం నుంచి వెళ్లడం వలన ఇక్కడ వెలసిన జ్యోతిర్లింగానికి 'మహాకాలుడు'అనే పేరు వచ్చినట్టు తెలుస్తోంది.

ఈ జ్యోతిర్లింగం ఇక్కడ ఆవిర్భవించడానికి కారణమైన కథను పరిశీలిస్తే ... పూర్వం శివభక్తుడైన ఓ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు వుండేవారు. శివ భక్తులైన ఆ నలుగురూ, సాధుజనులను హింసిస్తోన్న దూషణాసురుడనే రాక్షసుడిని సంహరించమంటూ తమ ఇష్టదైవాన్ని ప్రార్ధించారు. దాంతో శివుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని అంతమొందించాడు. ఆ తరువాత తన భక్తుల కోరిక మేరకు అక్కడే జ్యోతిర్లింగమై వెలిశాడు.

ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడిని పెంచి పెద్దచేసిన 'నందుడు'ఇక్కడి స్వామికి తొలిసారిగా ఆలయం నిర్మించాడని స్థల పురాణం చెబుతోంది. కాలక్రమంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరచడానికి ఎంతో మంది రాజులు ... చక్రవర్తులు కృషి చేశారు. కొందరు మతేతరులు ఈ ఆలయాన్ని కూలదోయడానికి పలుమార్లు దాడులు జరిపారు.

ఈ క్షేత్రంలో ద్వాదశ ఆదిత్యులు .. ఏకాదశ రుద్రులు .. దశ విష్ణువులు .. నవదుర్గలు .. అష్టభైరవులు .. అష్ట గణపతులు కొలువుదీరి వుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇటు మహాశివుడి జ్యోతిర్లింగంగాను ... అటు అమ్మవారి శక్తి పీఠం గాను విరాజిల్లుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన జన్మజన్మల పాపం నశిస్తుంది ... ముందు జన్మలకు కావలసిన పుణ్యాన్ని మూటగడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News