సప్త మాతృకలు అలా ఆవిర్భవించారు!

ప్రాచీన కాలానికి చెందిన కొన్ని క్షేత్రాలను దర్శించినప్పుడు, ఒకే శిలా ఫలకంపై చెక్కబడినవిగా .. ఒకే వరుసలో కొలువుదీరినవిగా ఏడు అమ్మవారి రూపాలు దర్శనమిస్తుంటాయి .. అవే 'సప్త మాతృకలు'. ఈ శక్తి స్వరూపాల ఆవిర్భావం వెనుక, ఒక ఆసక్తికరమైన కథ వుంది. పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడు తనకి గల వరబలం చేత గర్వించి, దేవతలను .. మహర్షులను అనేక విధాలుగా హింసిస్తుంటాడు. దాంతో దేవతల ప్రార్ధన మేరకు ఆ అసురుడిని సంహరించడానికి పరమ శివుడు రంగంలోకి దిగుతాడు.

అయితే అంధకాసురుడు నుంచి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుంచి ఒక్కో అసురుడు పుడుతుంటాడు. ఆ రక్తపు బొట్లు కిందపడకుండా చూడటం కోసం బ్రహ్మాది దేవతలు తమ అంశాలతో ఏడు శక్తి స్వరూపాలను సృష్టించి .. శివుడికి సాయంగా పంపించారు. ఆ శక్తి స్వరూపాలే .. సప్త మాతృకలు. ఆ శక్తి స్వరూపాలు .. అంధకాసురుడి రక్తపు బొట్లు కిందపడకుండా చేయడంతో, శివుడు ఆ అసురిడిని సంహరించాడు. అలా లోక కల్యాణం కోసమే సప్త మాతృకల ఆవిర్భావం జరిగింది.               


More Bhakti News