దుర్గా నామం జపిస్తే చాలు

కలియుగంలో దైవ నామ స్మరణ విశేషమైన ఫలితాలను చూపుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అందువలన ఎవరి ఇష్టదైవం నామాన్ని వాళ్లు స్మరిస్తూనే వుంటారు. ఒక్కో దైవీ నామం జపించడం వలన ఒక్కో ఫలితం లభిస్తుంది. జీవితాన్ని ఆనందమయం చేసి ఉన్నతమైన మార్గంలో నడిపించే నామాలలో దుర్గాదేవి నామం ఒకటి. పరిపూర్ణ బ్రహ్మస్వరూపిణిగా .. మంత్రాలన్నింటికీ మాతృకగా దుర్గాదేవిని గురించి చెబుతుంటారు. 'దు' అనే అక్షరం దుఃఖాన్ని .. దారిద్ర్యాన్ని నివారిస్తుంది. 'గ' అనే అక్షరం సర్వపాపాలను నశింపజేస్తుంది. ధనము .. ధైర్యము దుర్గాదేవి నామస్మరణ వలన కలుగుతాయి.

దుర్గాదేవి విజయ స్వరూపం .. ఆ తల్లి నామాన్ని జపించడం వలన తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి. ఆపదలు .. ఆర్ధికపరమైన ఇబ్బందులు ఆ తల్లి నామాన్ని స్మరించినంత మాత్రాన్నే తొలగిపోతాయి. స్త్రీల సౌభాగ్యాన్ని నిలిపేది ఆ తల్లియే. తనని నమ్మిన భక్తుల దరిదాపుల్లోకి దుష్టశక్తులు చేరకుండా ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది. అమ్మ మనసుతో అనుగ్రహించే ఆ తల్లి నామాన్ని సదా స్మరిస్తూనే ఉండాలి .. ఆ తల్లి సేవలో తరిస్తూనే ఉండాలి.


More Bhakti News