దేవి నవరాత్రులు ప్రారంభం

జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంపదలతో .. సంతానంతో .. సౌభాగ్యంతో సాగిపోవడానికి ఆదిపరాశక్తి అనుగ్రహం ఎంతో అవసరం. అలాంటి జగన్మాత నవరాత్రులలో ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరిస్తూ .. ఒక్కో నామంతో కొలవబడుతూ ఉంటుంది. అందువలన నవరాత్రులలో అమ్మవారి ఆలయాలు భక్త జన సందోహంతో కళకళలాడుతూ కనిపిస్తుంటాయి.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ శరన్నవరాత్రులు జరపబడుతూ ఉంటాయి. విదియతో కలిసిన పాడ్యమిని నవరాత్రులలో తొలిరోజుగా స్వీకరిస్తుంటారు. పాడ్యమి మొదలు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి దీక్ష తీసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి ఉంటుంది. బిడ్డల పట్ల అమ్మవారికి ఎంత అనురాగం ఉన్నప్పటికీ, ఆ తల్లిని పూజించే విషయంలో నియమనిష్ఠలు తప్పకుండా పాటించవలసి ఉంటుంది. ఈ నవరాత్రులలో కుమారీ పూజ .. సువాసినీ పూజ .. దంపతి పూజను నిర్వహిస్తుంటారు. ముత్తయిదువులకు చీర .. రవికతో పాటు తాంబూలాన్ని ఇవ్వడం వలన అమ్మవారు ప్రీతి చెందుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News