అయినవిల్లి గణపతి దర్శన ఫలితం

తూర్పుగోదావరి జిల్లా అనేక ప్రాచీన పుణ్యక్షేత్రాలకు నెలవుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ జిల్లాలోకి అడుగుపెట్టడం వలన ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ అలరారుతోన్న క్షేత్రాలలో 'అయినవిల్లి' ఒకటి. ఇది అమలాపురానికి సమీపంలో వెలుగొందుతోంది.

ఈ క్షేత్రంలో కొలువుదీరిన గణపతి .. మహా మహిమాన్వితుడని స్థల పురాణం చెబుతోంది. పూర్వం ఈ ప్రదేశంలో స్వర్ణగణపతి మహాయజ్ఞం జరగగా, స్వామి ప్రత్యక్షంగా వచ్చాడని చెబుతారు. ఆ సమయంలో ఆయన మనసుకి కష్టం కలిగేలా ప్రవర్తించిన ముగ్గురు మూర్ఖులను ఆయన తగిన విధంగా శిక్షించాడని అంటారు.

అందువలన స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా వున్నాడనీ .. తమ మొరలను వింటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో శ్రీ భూ సమేత కేశవస్వామి .. ముక్తీశ్వరస్వామితో కలిసి గణపతి ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు.

ఈ స్వామిని సేవించిన భక్తులు అనేక కష్ట నష్టాల నుంచి .. ఆపదల నుంచి బయటపడిన సంఘటనలు అనుభవాలుగా ఇక్కడ వినిపిస్తుంటాయి. అంకితభావంతో స్వామిని ఆరాధించాలేగానీ ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని చెబుతారు. ఎలాంటి ఆటంకాలనైనా తొలగించే 'అయినవిల్లి' గణపతిని దర్శించడం వలన కలిగే ఆనందం వేరు .. అనుభూతి వేరు.


More Bhakti News