శని ప్రభావాన్ని తొలగించే శివుడు

సాధారణంగా కొన్ని శైవ క్షేత్రాలలో రాహు .. కేతు సంబంధమైన పూజలు, శని ప్రభావాన్ని తొలగించే పూజలు జరుగుతుంటాయి. అలాంటి ప్రాచీనమైన క్షేత్రాలలో ఒకటిగా ఆదిలాబాద్ జిల్లాలోని 'సిరిచెల్మ' దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశాడని స్థలపురాణం చెబుతోంది. స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా తిరుగాడటం జరిగిందని చెబుతుంటారు.

ఈ గ్రామస్తులంతా స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించేవారట. అలాంటి గ్రామం ఒకసారి తీవ్రమైన కరువు బారినపడటం జరిగింది. ఎక్కడా నీళ్లు లేకపోవడంతో, గ్రామస్తులకు ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందసాగారు. అలాంటి పరిస్థితుల్లో స్వామివారు ఒక బాలుడి రూపంలో వచ్చి వాళ్లకి ధైర్యం చెప్పాడు. ఆ తరువాత తెల్లవారేసరికి స్వామి ఆ గ్రామంలో పెద్ద చెరువును తవ్వాడు. అప్పటి నుంచి ఆ చెరువు వాళ్ల జీవనాధారంలో ప్రధానభాగమైంది.

స్వామివారు ప్రత్యక్షంగా వచ్చి తమ కష్టాలను తీర్చాడు కనుక, అందుకు కృతజ్ఞతగా ఆ గ్రామస్తులు ఆయనని అనునిత్యం సేవిస్తూ వస్తున్నారు. తమ గ్రామాన్ని సదారక్షిస్తున్నవాడు ఆ సదా శివుడేనని విశ్వసిస్తుంటారు. ఆయా పుణ్య తిథుల్లో ఆయనని మరింతగా సేవించి తరిస్తుంటారు. స్వామిని ఆరాధించడం వలన సమస్త పాపాలు .. దోషాలు నశిస్తాయని అనుభవపూర్వకంగా చెబుతుంటారు.


More Bhakti News