దృష్టి

సాధారణంగా పిల్లలు గానీ ... పెద్దలు గాని హఠాత్తుగా డీలాపడిపోతే,''ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో ... దిష్టి (దృష్టి ) తగిలింది ''అనే మాటే ముందుగా వినిపిస్తుంటుంది. ఇక ఇలా దిష్టి తీయడంలోను మంచిపేరు సంపాదించుకున్న వాళ్లు లేకపోలేదు. దిష్టి తీయడం అనే ఆచారం పూర్వకాలం నుంచి వస్తోంది.

బారసాల ... అన్నప్రాసన ... పుట్టినరోజు ... పెళ్లి వంటి వేడుకల్లో తప్పని సరిగా దిష్టి తీస్తుంటారు. అలాగే పిల్లలు ఏదైనా ఒక రంగంలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కూడా దిష్టి తీస్తుంటారు. ఇలా పదిమంది దృష్టిని ఆకర్షించిన వారందరికీ ఆయా కుటుంబ సభ్యులు దిష్టి తీస్తూనే వుంటారు. నరుడి కళ్లలో నల్లరాయి కూడా పగులుతుందని పెద్దలు అంటూ వుండటం ఇలాంటి సందర్భాల్లో మనం వింటూనే వుంటాం. సాధారణంగా హారతి కర్పూరం వెలిగించి, సున్నం - పసుపు కలిపిన ఎరుపు రంగు నీళ్లతో దిష్టి తీస్తుంటారు. ఎరుపు రంగు చూడటం వలన ఒక రకమైన ధైర్యం రావడమే కాకుండా, నీరసం ... నిస్సత్తువ రాకుండా మంచి ప్రభావం చూపుతుందని అంటూ వుంటారు.

చాలామంది ఒకే వ్యక్తిని కేంద్ర బిందువుగా చేసి చూసినప్పుడు, వాళ్ల నుంచి విద్యుత్ తరంగాలు ఆ వ్యక్తి శరీరాన్ని తాకుతాయి. అవి తన శరీరానికి వ్యతిరేకతను కలిగించేవైనప్పుడు తల తిరగడం ... కడుపులో తిప్పడం వంటివి జరుగుతుంటాయి. ఆ విద్యుత్ తరంగాలను చెదరగొట్టే ప్రక్రియలోని భాగమే ఈ దిష్టి తీయడం అని చెబుతూ వుంటారు. ఇలా దిష్టి తీసిన నీళ్లు మరొకరు తొక్క కూడదనే ఉద్దేశంతో దారిలో కాకుండా మొక్కల్లో పోస్తుంటారు.


More Bhakti News