అలా పూరీ జగన్నాథుడు కొలువుదీరాడు

పూరీ జగన్నాథస్వామి రథోత్సవం మొదలుకావడానికి కొన్నిరోజుల ముందునుంచి, ఈ వేడుక పూర్తయ్యేంతవరకూ గల విశేషాలు ఆనందాశ్చర్యాలకి గురిచేస్తుంటాయి .. ఆ స్వామి మహిమలను చాటిచెబుతుంటాయి. ఇక్కడ స్వామి చెక్కతో చేయబడి ఉండటానికీ .. అవి అసంపూర్ణంగా ఉండటానికి గల కారణంగా కాస్త అటు ఇటుగా ఆసక్తికరమైన కథనం ఒకటి వినిపిస్తూ వుంటుంది.

ఒకసారి ఇంద్రద్యుమ్న మహారాజు తన భార్యతో కలిసి సముద్రస్నానం చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన ఒక కెరటం వాళ్లని సముద్రంలోకి తీసుకెళుతుంది. పరివారాన్ని వద్దని చెప్పి వచ్చినందు వలన, మృత్యువు బారిన పడకతప్పదని ఆ దంపతులు భావిస్తారు. అదే సమయంలో ఒక 'దుంగ' వారి వైపుకు కొట్టుకు వస్తుంది. ఆ దుంగను పట్టుకుని ఆ రాజదంపతులు ఒడ్డుకి చేరుకుంటారు.

భగవంతుడే ఆ రూపంలో తమని కాపాడాడని భావించి, ఆ దుంగను కూడా రాజ్యానికి తెప్పిస్తారు. ఆ రాత్రే శ్రీకృష్ణుడు రాజుగారి కలలో కనిపించి, వాళ్లని ఒడ్డుకు చేర్చినది తానేనని చెబుతాడు. ఆ దుంగను తన రూపంగాను .. అలాగే బలరాముడు .. సుభద్ర రూపాలుగాను మలిపించి, 'నీలాచలం'లో వుంచి పూజించవలసిందిగా చెప్పాడట.

ఇక ఆ దుంగను శిల్పాలుగా మలుస్తోన్న సమయంలో ఎవరూ అక్కడికి రాకూడదనే నిబంధనని ఆ రాజు ఉల్లంఘించినందువల్లనే అవి అసంపూర్ణంగా ఉండిపోయాయట. అందుకే తరతరాలుగా ఇక్కడ చెక్కతో చేసిన అసంపూర్తి విగ్రహాలను ఆరాధించడం జరుగుతోందని చెబుతుంటారు.


More Bhakti News