ఏకాదశి ఉపవాస ఫలితం

ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు. పరమపవిత్రమైన ఈ రోజున ఎవరు తనని ఆరాధిస్తూ .. పూజాభిషేకాలు జరుపుతారో, ఉపవాస .. జాగరణ నియమాలను పాటిస్తూ కొలుస్తారో వాళ్లపై స్వామి కరుణా కిరణాలను ప్రసరింపజేస్తూ ఉంటాడు.

ప్రతి ఏకాదశి ప్రత్యేకతను కలిగినదిగా చెప్పబడుతోంది. ఒక్కో ఏకాదశి రోజున స్వామిని ఆరాధించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాంటి ఏకాదశులలో ఆషాఢశుద్ధ ఏకాదశి ఒకటిగా చెప్పబడుతోంది. దీనినే 'శయన ఏకాదశి'గా చెబుతుంటారు.

శ్రీమహావిష్ణువు ఈ రోజున 'యోగనిద్ర'లోకి ప్రవేశిస్తాడు. అందువలన 'చాతుర్మాస్య వ్రతం' ఈ రోజు నుంచి ఆరంభిస్తూ వుంటారు. ఈ శయన ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించడం వలన, ఉపవాస .. జాగరణలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఈ రోజున శ్రీమన్నారాయణుడి స్మరణ చేస్తూ గడపడం వలన పాపాలు .. శాపాలు .. దోషాలు .. వివిధ రకాల వ్యాధులు తొలగిపోతాయని స్పష్టం చేయబడుతోంది. అందుకే ఏకాదశి రోజున శ్రీమహా విష్ణువును పూజించి తరించే అవకాశాన్ని ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోకూడదు.


More Bhakti News