నారసింహుడు అలా వెలుగు చూశాడు

లోక కల్యాణం కోసం హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహస్వామి, అదే రూపంలో అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. దేవతలు .. మహర్షులచే పూజాభిషేకాలు అందుకుంటూ వచ్చాడు. సాధారణ మానవులు కొన్ని కారణాల వలన తన ఆచూకీ తెలుసుకోలేకపోయిన సందర్భాల్లో, భక్తులకు స్వప్న దర్శనమిచ్చి తన అర్చామూర్తి జాడను తెలియజేశాడు.

అలా వెలుగు చూసిన నరసింహస్వామి మూర్తులలో ఒకటి కడప జిల్లా 'చిన్నమండెం' గ్రామానికి సమీపంలో దర్శన మిస్తుంది. ఇక్కడ స్వామి 'మండెం నరసింహ స్వామి'గా పిలవబడుతూ వుంటాడు. నరసింహస్వామి భక్తుడైన మాండవ్యుడు ఒకప్పుడు ఈ ప్రదేశంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడట.

అలా ఒక రోజున ఆయన తపస్సు చేసుకుంటూ వుండగా, స్వామి రూపం కనులముందు కదలాడింది. తన అర్చామూర్తి ఫలానా చోటున ఉందనీ, దానిని వెలికి తీసి పూజాభిషేకాలు జరిపించమని స్వామి ఆదేశించాడు. స్వామి దర్శన భాగ్యం లభించడం .. స్వయంవ్యక్తమైన స్వామి అర్చామూర్తిని ప్రతిష్ఠింపజేసే అవకాశం కలగడం .. ఆయనని సేవించుకునే అదృష్టం లభించడంతో ఆయన సంతోషంతో పొంగిపోయాడు.

గ్రామస్తుల సహాయ సహకారాలతో పవిత్రమైనటు వంటి ఆ కార్యాన్ని పూర్తి చేశాడు. అందుకే ఆ ఊరికీ .. ఆ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు. ఇక్కడి స్వామివారిని దర్శించడం వలన భయము .. దుఃఖము .. దారిద్ర్యము తొలగిపోయి, ఆయురారోగ్యాలతో కూడిన సుఖశాంతులు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.


More Bhakti News