సిరిని తెచ్చే గుడ్లగూబ

'గుడ్లగూబ'ను చూడటానికే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే అది మిగతా పక్షులకు భిన్నంగా కనిపించడమే కాకుండా, జరగనున్న కీడుకు అది సంకేతమని చిన్నప్పటి నుంచి వింటూ వస్తుండటమే అందుకు కారణమని చెప్పవచ్చు. ఇక గుడ్లగూబ రాత్రి వేళల్లో మాత్రమే కనిపించడం ... దాని అరుపు వికృతంగా వుండటం ... అది ఇంట్లోకి వస్తే కొంత కాలంపాటు ఆ ఇల్లే వదిలి పెట్టాలని చెప్పుకోవడం ... అది కనిపించిన పరిసరాలలో చావు మాట వినిపిస్తుందనే ప్రచారం జరగడం గుడ్లగూబపై ఎవరికీ సరైన అభిప్రాయం లేకుండా చేసింది.

అయితే శాస్త్రం మాత్రం గుడ్లగూబను మించిన శుభ శకునం మరొకటి లేదని చెబుతోంది. విష్ణువుకు గరుత్మంతుడు ... శివుడికి నంది ... వినాయకుడికి ఎలుక ... కుమారస్వామికి నెమలి వాహనమైనట్లే, లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనమని చెబుతోంది. లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసినప్పుడు గరుత్మంతుడి వాహనాన్ని, ఒంటరిగా ప్రయాణించ వలసి వచ్చినప్పుడు గుడ్లగూబను అధిరోహించేదని శాస్త్రాలు చెబుతున్నాయి.

'ఉల్లూక తంత్రం'లో గుడ్లగూబ దర్శనం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పబడింది. రాత్రి నాల్గొవ జాములో గుడ్లగూబ ఎవరింటి వాకిలిపై వాలినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట. ప్రయాణ సమయాల్లో గుడ్లగూబ ఎడమవైపున కనిపిస్తే వెళుతోన్న పని తప్పనిసరిగా పూర్తి అవుతుంది. గర్భవతి అయిన స్త్రీని గుడ్లగూబ తాకడం వలన మంచి సంతానం లభిస్తుంది.

గుడ్ల గూబ ఇంటి ఆవరణలో గానీ ... పశువుల శాలలో గాని, పొలంలోని చెట్లపై గాని నివాసముంటే, ఆ యజమానికి పాడి పంటలకు ... సుఖ సంతోషాలకు కొదవ ఉండదట. కాబట్టి ఇక నుంచి గుడ్ల గూబను చూసి భయపడవలసిన అవసరం లేదు ... దానిని కీడు పక్షిగా భావించి కలత చెందవలసిన పనీ లేదు.


More Bhakti News