పాపాలను దహించే దశమి

ఈర్ష్యా .. అసూయ .. ద్వేషం .. మోహం .. కామం .. స్వార్థం .. ఇవన్నీ కూడా అనేక పాపాలు చేయడానికి కారణమవుతూ వుంటాయి. పాపకార్యాలు చేస్తున్నప్పుడు తాము పాపం చేస్తున్నామనే ఆలోచన రాదు. అనుకున్నది సాధించామా లేదా అనేదానిపైనే దృష్టి పెడుతుంటారు. బరువు పెరుగుతూ వుండటం వలన నీటిలో మునిగిపోవడం ఎలా సంభవిస్తుందో, పాపాల రాశి పెరుగుతున్నా కొద్దీ వారిని కష్టాలు .. బాధలు కిందికి లాగుతూ వుంటాయి.

చేసిన పాపాల ఫలితాలు వెంటాడుతూ అవే అనుభవాలు పొందేలా చేస్తుంటాయి. ఇతరులను బాధపెడుతూ తాము పొందిన ఆనందాన్ని దూరం చేస్తూ, దుఃఖానికి దగ్గర చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాపచింతన కలిగి పరమాత్ముని పాదాలను ఆశ్రయిస్తే, కొంత ఉపశమనం కలుగుతుంది. లేదంటే పతనావస్థలో పాట్లుపడుతూ రానున్న జన్మలో ఆ పాపాలను అనుభవించడానికి సిద్ధపడుతూ, కన్నీళ్లతో తనువు చాలించవలసి వస్తుంది.

ఇలా గత జన్మల పాపాలు అభివృద్ధికీ .. ఆనందమయ జీవితానికి ఆటంకాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి పదిరకాలైన పాపాల నుంచి బయటపడేసేదిగా 'దశపాపహర దశమి' కనిపిస్తుంది. జ్యేష్ఠ శుద్ధ దశమికే దశపాపహర దశమి అని పేరు. ఈ రోజు ఉదయాన్నే గంగానదిలో స్నానం చేయాలి. లేదంటే గంగ నీటిగా భావన చేసుకుని స్నానం చేసి .. సూర్యుడిని ఆరాధించాలి.

ఆ తరువాత ఇష్టదైవాన్ని పూజించి .. ఆలయ దర్శనం చేయాలి. భగవంతుడి నామస్మరణతో .. భజనలతో .. కీర్తనలతో .. పారాయణాలతో ఈ రోజంతా గడపాలి. ఈ విధంగా చేయడం వలన జీవితాన్ని అతలాకుతలం చేసేటువంటి పది పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఉత్తమగతులు పొందడానికి అవసరమైన అర్హత లభిస్తుంది.


More Bhakti News