అరుణాచల ప్రదక్షిణ ఫలితం

మానవ జన్మను సార్ధకం చేసుకోవడం కోసం ఎవరి ప్రయత్నం వాళ్లు చేస్తుంటారు. అలాంటి ప్రయత్నాల్లో ప్రధానమైనదిగా పుణ్యక్షేత్ర దర్శనం చెబుతుంటారు. సాధారణంగా ఏ క్షేత్రనికైనా వెళ్లి అక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన పుణ్యరాశి పెరుగుతుంది. పరమశివుడు కొలువైన అరుణాచల క్షేత్రం విషయానికి వచ్చేసరికి, కేవలం స్మరణ మాత్రం చేతనే అనంతమైన పుణ్యఫలితాలను ఇస్తుందని చెప్పబడుతోంది.

పంచభూత లింగాలలో తిరువణ్ణామలైగా పిలవబడుతోన్న అరుణాచలంలో దర్శనమిచ్చేది అగ్నిలింగంగా చెప్పబడుతోంది. ఇక్కడి పర్వతమే అగ్నిస్వరూపమనీ, పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడిగా భూమ్మీద ఆవిర్భవించినది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. అందువల్లనే ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు ఈ కొండచుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. విశేషమైన పర్వదినాల్లో ప్రదక్షిణలు చేసే భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.

ఈ కొండచుట్టూ ఎనిమిది దిక్కులలో ఎనిమిది శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కో శివలింగాన్ని దర్శించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది. ఈ క్షేత్రాన్ని దర్శించి .. స్వామివారిని సేవించి ధన్యత పొందిన ఎంతోమంది భక్తుల చరిత్రలు ఇక్కడ వినిపిస్తుంటాయి. గిరిప్రదక్షిణం వలన శివ సాయుజ్యాన్ని పొందిన సంఘటనలు ఆధ్యాత్మిక చింతనను అధికం చేసే కథలుగా కనిపిస్తుంటాయి.

గిరిప్రదక్షిణం చేయడం వలన జన్మజన్మలుగా వెంటాడుతోన్న పాపాలు నశిస్తాయి. అనుకోకుండా కలిగే దోషాలు ... తగిలే శాపాలు తొలగిపోతాయి. అనునిత్యం దేవతలు .. మహర్షులు తిరుగాడే ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన ఫలితంగా, అగ్ని స్వరూపమైన శివుడిని దర్శించడం వలన పాపకర్మలు దహించబడి మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News