వైశాఖ బహుళ ఏకాదశి ప్రత్యేకత

ఏకాదశి అనే పేరులోనే పవిత్రత కనిపిస్తుంది ... ఏకాదశి వ్రతం వలన శ్రీమహావిష్ణువు మహాత్మ్యం తెలుస్తుంది. ఏకాదశి అనే పుణ్యతిథి ప్రతి నెలలోను రెండుమార్లు వస్తుంది. ప్రతి ఏకాదశికి ఎంతో ప్రత్యేకత వుంది ... మరెంతో విశిష్టత వుంది. ఏకాదశి వ్రత ఫలితాలను తెలిపే కథలెన్నో మనకి ఆధ్యాత్మిక గ్రంధాలలో కనిపిస్తుంటాయి.

అలా వైశాఖమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని 'వరూధిని ఏకాదశి' అనీ .. 'అపర ఏకాదశి' అని పిలుస్తూ ఉంటారు. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి శ్రీమన్నారాయణుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించాలి. దగ్గరలోని ఆ స్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి. లేదంటే ఆయన ఆలయానికి వెళ్లి పూజాభిషేకాలు జరిపించాలి. స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి.

స్వామి ఆలయంలో కూర్చుని స్తోత్రాలు పఠిస్తూ .. పారాయణాలు చేస్తూ ... ఆయన లీలావిశేషాలను కీర్తిస్తూ ఉండాలి. ఇలా స్వామి ధ్యానం చేస్తూనే జాగరణ పూర్తిచేయాలి. ఏకాదశి వ్రత నియమాలు తెలుసుకుని ఆ ప్రకారంగా ఆ స్వామిని పూజించడం వలన, అనేక జన్మల పాపాలు పటాపంచలవుతాయని చెప్పబడుతోంది. అంతేకాకుండా యజ్ఞ యాగాదులు నిర్వహించిన ఫలితం .. గోదానం చేసినంత ఫలితం .. మహిమాన్వితమైనటు వంటి వైష్ణవ క్షేత్రాలను దర్శించిన ఫలితం కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News