ఏరువాక

'ఏరువాక పూర్ణిమ'ను పల్లెవాసులు తమ వ్యవహారిక భాషలో ఏరువాక పున్నమి అని పిలుచుకుంటూ వుంటారు. సాధారణంగా ఏరువాక అనే మాట పల్లెల్లోనే ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఎందుకంటే పల్లెలే పాడిపంటలకు పట్టుగొమ్మలుగా అలరారుతుంటాయి కాబట్టి.

పాడి విషయంలో ఆవులు ... పంట విషయంలో ఎద్దులు వ్యవసాయ దారులకు ఎంతగానో సహకరిస్తూ వారి జీవితంలో అవి మమేకమైపోయాయి. రైతన్నలు ప్రతి ఏడాది జ్యేష్ట శుద్ధ పూర్ణిమ రోజున బసవన్నల సాయంతో తమ పొలాలను దుక్కి దున్నడం మొదలు పెడతారు. ఆ రోజునే ఏరువాక పున్నమి అంటారు. తమ జీవనాధారమైన పంటను ఇచ్చే నేలతల్లి అనుమతి తీసుకుని ... దున్నడం మొదలు పెట్టడాన్ని వాళ్లు తాము జరుపుకునే తొలి పండుగగా భావిస్తుంటారు.

ఏరువాక రోజున వాళ్లు ఎద్దుల మెడలో కొత్త గంటలు ... కాళ్లకి గజ్జెల పట్టీలు కడతారు. గవ్వలు ... జీడి గింజలతో కూడిన నల్లని దిష్టి తాళ్లను కూడా మెడలో కడతారు. కొమ్ములకు అందంగా వేలాడే కుచ్చు పూలను అలంకరించి, నుదుటున కుంకుమతో బొట్టు పెడతారు. ఆ తరువాత వాటిని మంగళ వాయిద్యాలతో పొలానికి తీసుకువెళ్లి అక్కడ ధూప దీపాలు వెలిగించి పూజ చేస్తారు. సిరులపంట పండించమని నేలతల్లికి నమస్కరించి దుక్కి దున్నడం మొదలుపెడతారు.

ఈ విధంగా చేయడం వల్ల రైతుల్లో ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. తమ యజమాని తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలనే ఉద్దేశం ఆ మూగజీవాల కళ్లలో కనిపిస్తూ వుంటుంది. అయితే ఇదంతా పల్లెటూళ్లలో జరిగే ఓ చిన్నపాటి తంతు అని కొట్టి పారేయడానికి లేదు. ప్రాచీన కాలంలోనే శుద్దోదన మహారాజు ఈ ఏరువాక పున్నమి రోజున దుక్కిదున్నడాలు ప్రారంభించి రైతులకు ప్రోత్సాహాన్ని అందించినట్టు చరిత్ర చెబుతోంది.

ఇక ఎంతో మంది రాజులు ... చక్రవర్తులు కూడా ఏరువాక పున్నమికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఏదేవైనా పచ్చదనానికి ... పలకరింపులకి నెలవైన పల్లెటూళ్లలో జరిగే ఏరువాకను చూడటం, మానసిక ఉల్లాసాన్ని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


More Bhakti News