పాపాలను నశింపజేసే దివ్యతీర్థం !

లోక కల్యాణం కోసం భగవంతుడు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అలా ఆ భగవంతుడు కొలువైన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా అలరారుతున్నాయి. దేవతలు ... మహర్షులు .. సద్గురువులు .. మహాభక్తులు ఇలా ఎంతోమంది ఆయా క్షేత్రాలను దర్శిస్తూ వుంటారు. వారి పాదస్పర్శ కారణంగా ఆ ప్రదేశం మరింత పవిత్రమవుతుంది.

అలాంటి క్షేత్రాల్లో అడుగుపెట్టడం వలన పాపాలు నశిస్తాయి. పాపాలను ప్రక్షాళన చేయడంలో తీర్థాలు కూడా ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి. ఆయా క్షేత్రాల్లో గల జలాశయం .. కోనేరు .. కొలను .. పుష్కరిణి .. తీర్థాలుగా పిలవబడుతూ వుంటాయి. ప్రధాన దైవంగా అక్కడ ఆవిర్భవించిన స్వామికీ ... తీర్థానికి సంబంధం వుంటుంది.

స్వామి సంకల్పంతోనే తీర్థాలు ఏర్పడుతూ వుంటాయి. అందువలన క్షేత్రాలను ... తీర్థాలను వేరుగా చూడటం జరగదు. ఇక ఆయా క్షేత్రాలకి వెళ్లిన భక్తులు ముందుగా ఈ తీర్థాలలోనే స్నానమాచరిస్తూ వుంటారు. ఇలా దివ్యతీర్థాలలో స్నానం చేయడం వలన పాపాలు హరిస్తాయని విశ్వసిస్తుంటారు. అలాంటి విశ్వాసం మరింత బలంగా వినిపించే వైష్ణవ క్షేత్రంగా 'శిరీవరమంగై' కనిపిస్తుంది.

తిరునల్వేలి సమీపంలో ఈ దివ్యక్షేత్రం విలసిల్లుతోంది. దేవతలు ... మహర్షులు నడయాడిన పుణ్యస్థలిగా ఈ క్షేత్రాన్ని గురించి చెబుతుంటారు. ఇక్కడి పుష్కరిణి 'శేత్తు తామరై' పేరుతో పిలవబడుతూ వుంటుంది. ఇది మహిమాన్వితమైనదని స్థలపురాణం చెబుతోంది. ఈ తీర్థంలోగల జలాన్ని తలపై చిలకరించుకున్నా సమస్త పాపాలు నశించిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడ ఎన్నో ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి .. ఈ పుష్కరిణి విశిష్టతను చాటుతుంటాయి.


More Bhakti News