శ్రీరామరక్షా స్తోత్ర పఠన ఫలితం

లోకంలో ఏది న్యాయసమ్మతమైనదో ... ఏది కానిదో నిర్ణయించే అధికారం ఒక్క ధర్మానికి మాత్రమే వుంటుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాంటి ధర్మాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎన్నికష్టాలు ఎదురైనా వాళ్లని అది గమ్యానికి చేరుస్తుందనే విషయాన్ని ఈ లోకానికి శ్రీరామచంద్రుడు చాటిచెప్పాడు. అలాంటి రాముడిని తలచుకోని వాళ్లంటూ ఎవరూ వుండరు.

అందువల్లనే ఊరూరా ఆయన ఆలయాలు కనిపిస్తూ వుంటాయి. అడుగడుగునా ఆయన నామం వినిపిస్తూ వుంటుంది. అలాంటి రాముడికి రక్షణగా నిలవడమే తెలుసు ... రక్షించడమే తెలుసు. అందుకే చిన్నపిల్లలను ఆశీర్వదించే సమయంలోను 'శ్రీరామరక్ష' అంటూ వుంటారు. రక్షించేవాడే రాముడు అనే విశ్వాసాన్ని ఆవిష్కరించేదిగా 'శ్రీరామరక్షా స్తోత్రం' కనిపిస్తూ వుంటుంది. శ్రీరామనవమి రోజున మాత్రమే కాదు .. అనునిత్యం పఠించవలసిన స్తోత్రంగా ఇది చెప్పబడుతోంది.

ఎవరైతే ఈ స్తోత్రాన్ని అంకితభావంతో పఠిస్తూ వుంటారో, వాళ్లని అది సదా రక్షిస్తూ ఉంటుందని స్పష్టం చేయబడుతోంది. అనారోగ్యాలు ... ఆపదలు ... ఆర్ధికపరమైన ఇబ్బందులు జీవితాన్ని దుఃఖమయం చేస్తుంటాయి. ఇలా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న వాళ్లను క్షేమంగా తీరం చేర్చే 'నావ'గా రామరక్షా స్తోత్రం కనిపిస్తుంది. ఎవరు ఎలాంటి కష్టంలో వున్నా, దాని నుంచి బయటపడేసే శక్తిమంతమైన ఆయుధంగా ఇది చెప్పబడుతోంది. అందుకే ఈ స్తోత్రం మహిమాన్వితమైనదని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.


More Bhakti News