శ్రీరామ పట్టాభిషేక మహోత్సవ దర్శన ఫలితం !

శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం అనగానే .. ఛత్రముగల సింహాసనంపై సీతారాములు ఆశీనులై అభయముద్రలో కూర్చుని వుండగా, వారి సన్నిధిలో లక్ష్మణ .. భరత శత్రుఘ్నులు .. పాదాల చెంత హనుమంతుడు గల దృశ్యం కనులముందు కదలాడుతూ వుంటుంది. రామచంద్రుడి పట్టాభిషేక చిత్రపటంగా ఇది చాలామంది ఇళ్లలో కనిపిస్తూ వుంటుంది.

ఈ చిత్రపటాన్ని ఎక్కువగా గుమ్మానికి పైన తగిలిస్తూ వుంటారు. సీతారాముల పాదాల క్రిందగా అటూ ఇటూ తిరుగుతూ వుండటం మంచిదనే విశ్వాసమే ఇందుకు కారణం. ఇంతటి విశిష్టత కలిగిన ఈ పట్టాభిషేక దృశ్యం చైత్రశుద్ధ దశమి రోజున కొన్ని క్షేత్రాల్లో కనిపిస్తుంది. వసంతనవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు సీతారాములకు ప్రత్యేక పూజలు .. సేవలు జరుగుతుంటాయి.

ఇక నవమి రోజున సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ రోజున సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించి .. భక్తిశ్రద్ధలతో కట్నకానుకలు చదివించుకుంటారు. మరునాడు దశమి రోజున కొన్ని క్షేత్రాల్లో 'శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం' జరుపుతుంటారు. ధర్మస్వరూపుడైన రాముడికి ధర్మరక్షణ కోసం ఈ పట్టాభిషేకం జరిగింది.

అయోధ్యలో జరిగిన రాముడి పట్టాభిషేక మహోత్సవం గురించి చదువుతున్నా ... వింటున్నా ఆ సమయంలో తాము కూడా అక్కడ వుంటే బాగుండేదని ప్రతి ఒక్కరూ అనుకుంటూ వుంటారు. అలాంటి అవకాశాన్ని కల్పిస్తూ ఆయా రామాలయాలు ఈ రోజున ఆ పట్టాభిషేక మహోత్సవాన్ని అందంగా ఆవిష్కరిస్తూ వుంటాయి. ఈ వేడుకను తిలకించడానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించడం వలన, సమస్త పాపాలు .. దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News