శ్రీరామనవమి పూజా విశేషం

శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు ... సత్యధర్మాలను రెండుకళ్లుగా చేసుకుని ఆయన తన పరిపాలన కొనసాగించాడు. ఆయన కాలంలో ప్రజలు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా సిరిసంపదలతో .. సుఖశాంతులతో జీవనాన్ని కొనసాగించారు. అందువలన ఇప్పటికీ ఎవరి ఏలుబడిలోనైనా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా వుంటే, ఆ ప్రాంతాన్ని రామరాజ్యంతో పోలుస్తుంటారు. రాముడి పరిపాలనా విధానం అంతటి ప్రసిద్ధిచెందింది.

అలాంటి రాముడి నామం 'విష్ణుసహస్ర నామం'తో సమానమైనదని సాక్షాత్తు పార్వతీదేవితో పరమశివుడు చెప్పాడు. ఎంతోమంది మహర్షులు రాముడిని సేవించి తరించారు. మరెందరో భక్తులు ఆయనని కీర్తించి ధన్యులయ్యారు. అలాంటి రాముడికి ఆలయంలేని గ్రామమంటూ కనిపించదు. ఇటీవల కాలంలో నిర్మించబడిన రామాలయాలకి వెళితే, గర్భాలయంలో హనుమ సహిత సీతారామలక్ష్మణులు దర్శనమిస్తుంటారు.

ఇక ప్రాచీనకాలం నాటి ఆలయాలకి వెళితే అక్కడి గర్భాలయంలో హనుమ సమేత సీతారామలక్ష్మణులతో పాటు భరత శత్రుఘ్నులు కూడా దర్శనమిస్తుంటారు. ఇలా హనుమంతుడితో పాటు అయిదు మూలమూర్తులు కలిగిన ఆలయాలు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటాయి. తమ విశిష్టతను చాటుతూ వుంటాయి.

అలా హనుమంతుడితోపాటు సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కలిగిన చిత్రపటాన్ని శ్రీరామనవమి రోజున పూజించాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఇలా పూజామందిరంలో ఈ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం వలన, సమస్త పాపాలు .. దోషాలు ... దారిద్ర్యం నశించి ఆయురారోగ్యాలు లభిస్తాయని చెప్పబడుతోంది.


More Bhakti News