రాముడి క్షేత్రాలను దర్శిస్తే చాలు

ఏ ఊళ్లో అడుగుపెడుతున్నా ముందుగా రామాలయమే దర్శనమిస్తుంది. ఏ ఊరికి వెళ్లినా అక్కడి రామాలయాన్ని చూడకుండా ఎవరూ తిరిగిరారు. రాముడితో ప్రజలకు గల అనుబంధం అలాంటిది. మా రామయ్య ... మా సీతమ్మ అనే మాటలు వారిపట్ల గల ఆత్మీయతను ఆవిష్కరిస్తుంది. అంతటి ప్రేమానురాగాలను సొంతం చేసుకున్నారు కనుకనే, ప్రాచీనకాలం నాటి రామాలయాలు సైతం ఈ నాటికీ వైభవంతో వెలుగొందుతున్నాయి.

అలాంటి క్షేత్రాల్లో కొన్ని రాముడు నడయాడినవి కాగా, మరికొన్ని ఆయన స్వయంభువుగా ఆవిర్భవించినవిగా దర్శనమిస్తూ వుంటాయి. అలాంటి కొన్ని క్షేత్రాల్లో రాములవారి పాదంగా చెప్పబడే పాదముద్రలు కనిపిస్తూ వుంటాయి. మరికొన్ని క్షేత్రాల్లో సీతమ్మవారి పాదంగా చెప్పబడే పాదముద్రలు దర్శనమిస్తూ వుంటాయి. భక్తులు ఈ పాదముద్రల చెంత మోకాళ్లపై కూర్చుని శిరస్సును తాకిస్తూ నమస్కరిస్తూ వుంటారు.

ఇక కొన్ని క్షేత్రాల్లోగల కోనేర్లు ... రాముడి బాణం నుంచి ఉద్భావించినవిగా చెబుతుంటారు. వనవాస కాలంలో తమ దాహం తీర్చుకోవడం కోసం రాముడు అక్కడక్కడా ఇలా బాణప్రయోగం చేయగా, పాతాళగంగ పొంగుకు వచ్చిందని అంటారు. ఈ కోనేర్లు ఎలాంటి పరిస్థితుల్లోను ఎండిపోకపోవడం ... ఆ నీరు ఎంతో రుచిగా వుండటం విశేషం.

ఇక కొన్ని క్షేత్రాల్లో శ్రీరామనవమి రోజున స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా తలంబ్రాలు పడగానే హర్షాన్ని ప్రకటిస్తున్నట్టుగా వర్షం పడుతుంది. 'చదలవాడ' వంటి కొన్ని క్షేత్రాల్లో శ్రీరామనవమి రోజున కల్యాణోత్సవం జరుగుతూ వుండగా, ఆ ప్రదేశంలో గరుడపక్షి ప్రదక్షిణలు చేసి వెళుతుంది. ఇలా రామయ్య కొలువైన క్షేత్రాల్లో ఎన్నో విశేషాలు వినిపిస్తుంటాయి ... మరెన్నో మహిమలు కనిపిస్తుంటాయి.


More Bhakti News