శ్రీరామనవమి రోజున దీపారాధన

శ్రీరామనవమి అనగానే ప్రతి గ్రామంలోను సందడి కనిపిస్తుంది. ఇక పట్టణాల్లోని కాలనీల్లోనూ ఇదే సంబరం దర్శనమిస్తుంది. దాదాపుగా ప్రతి గ్రామంలోను రామాలయం వుంటుంది. అందువలన సీతారాముల కల్యాణ మహోత్సవ సంబరం ఈ రోజున అన్నిచోట్లా కనువిందుచేస్తూ వుంటుంది.

రాముడు చైత్రశుద్ధ నవమి రోజున .. పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించినట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఉగాది నుంచి ఆరంభమయ్యే వసంతనవరాత్రుల్లో రామచంద్రుడిని పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులలో రామాయణ పారాయణం ... రామకథా గానం విశేషమైన ఫలితాలను ఇస్తాయి.

ఇక నవమి రోజున మధ్యాహ్నం సమయంలో అన్ని క్షేత్రల్లోను స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున పూజామందిరంలో సీతారాముల ప్రతిమలను ఏర్పాటు చేసుకుని ఆరాధించేవాళ్లు ఎంతోమంది వుంటారు. అయితే ఈ రోజున స్వామివారి సన్నిధిలో ఏ నూనెతో దీపారాధన చేయాలనే సందేహం కొంతమంది భక్తులకు కలుగుతుంటుంది.

ఎందుకంటే ఆయా పర్వదినాలలో దీపారాధనకి ఉపయోగించే తైలం కూడా విశేషాన్ని సంతరించుకుని వుంటుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి రోజున దీపారాధనకి 'కొబ్బరి నూనె' ఉపయోగించాలని చెప్పబడుతోంది. ఈ రోజున పూజామందిరానికి రెండు వైపులా కొబ్బరినూనెతో గల దీపపు కుందులు వుంచి .. ఐదేసి వత్తుల చొప్పున కుందుల్లో వేసి వెలిగించ వలసి వుంటుంది. శ్రీరామనవమి రోజున ఇలా కొబ్బరినూనెతో దీపారాధన చేయడం వలన, విశేషమైన ఫలితాలు లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News