దైవానికి ఇష్టమైన ఫలాలు సమర్పించాలి

చైత్రశుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు 'వసంత నవరాత్రులు' జరుగుతుంటాయి. నూతన సంవత్సరంలోని తొలి తొమ్మిదిరోజులు శ్రీరాముడిని పూజించడం వలన సకలశుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది. చైత్రశుద్ధ నవమి రోజున సీతారాములకు అంగరంగవైభవంగా కల్యాణమహోత్సవం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వైష్ణవ సంబంధమైన ఆలయాలలో కనిపించే సందడి అంతాఇంతా కాదు.

గ్రామాలలో అయితే అంతా ఈ రోజున ఆలయం దగ్గరే వుంటారు. సీతారాముల కల్యాణమంటే ప్రతిఒక్కరూ అది తమ కుటుంబానికి సంబంధించిన వేడుకలా ఉత్సాహం చూపుతుంటారు .. సంతోషంతో సందడి చేస్తుంటారు. ఈ రోజున ఎవరికి వారు తమ ఇంటిని మంగళకరంగా అలంకరించుకుంటారు. పూజామందిరంలో సీతారాముల ప్రతిమలను ఏర్పాటుచేసుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వివిధ రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు.

ఇక ఆలయానికి వెళ్లి కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తుంటారు. ఈ సమయంలోనే వివిధరకాల పండ్లను సమర్పిస్తుంటారు. సాధారణంగా ఆయా దైవాలకు ఇష్టమైన ఫలాలను గురించి తెలుసుకుని సమర్పిస్తే, వారి అనుగ్రహం మరింత త్వరగా లభిస్తుందట. ఈ నేపథ్యంలో రాములవారికి అరటిపండ్లు .. జామపండ్లు .. కమలాపండ్లు ... దానిమ్మపండ్లు ఎంతో ఇష్టమైనవిగా చెప్పబడుతున్నాయి.

అందువలన స్వామివారి దర్శనానికి వెళుతున్నప్పుడు ఈ ఫలాలను తీసుకువెళ్లడానికి ప్రయత్నించాలి. స్వామివారికి ప్రీతికరమైన ఈ పండ్లను సమర్పించడం, ఆయన పట్ల గల ప్రేమానురాగాలకు నిదర్శనంగా నిలుస్తుంటుంది. స్వామికి మనసుకి సంతోషాన్ని కలిగించడం కన్నా కావలసిన ఆనందం ఏవుంటుందని అనిపిస్తుంది.


More Bhakti News