భగవంతుడిని కదిలించేదే భక్తి

దేవుడు వున్నాడా .. లేడా ? అనే సందేహంతో సతమతమైపోయేవాళ్లు అనాదికాలం నుంచి వున్నారు. దేవుడు ఉన్నాడంటే వున్నాడు ... లేడంటే లేడు .. అని ఎవరి విశ్వాసానికి వాళ్లని వదిలేసే వాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఇక దేవుడు లేడు అని చెప్పేవాళ్లు, మిగతావారి అభిప్రాయాలతో ప్రమేయం లేకుండా తమ పని తాము చేసుకు పోతుంటారు.

కానీ దేవుడు వున్నాడని చెప్పిన కొంతమంది భక్తులు మరిన్ని ప్రశ్నలను ఎదుర్కున్నారు. ఒక్కోసారి ఆ విషయాన్ని నిరూపించవలసి వచ్చే సందర్భాలను చూశారు. అలాంటి భక్తులలో 'తులసీదాసు' ఒకరుగా కనిపిస్తాడు. శ్రీరామచంద్రుడిని ఆరాధించినటువంటి మహాభక్తులలో తులసీదాసు ముందువరుసలో కనిపిస్తాడు. హనుమంతుడు కూడా ఆయన పిలవగానే పలికేవాడు.

రామచంద్రుడిని కీర్తిస్తూ, హనుమంతుడి మనసు గెలుచుకుని ఆయన ద్వారా సీతారాములను ప్రత్యక్షంగా దర్శించిన ఘనత తులసీదాసులో కనిపిస్తుంది. అలాంటి తులసీదాసు రామనామామృతాన్ని పానంచేస్తూ అనేక క్షేత్రాలను దర్శిస్తూ 'కాశీ' కి చేరుకుంటాడు. అలా ఆయన కాశీలో ఉండటం కొంతమంది మతేతరులకు నచ్చలేదు. దాంతో ఎలాగైనా ఆయనని అక్కడి నుంచి పంపించివేయాలని వాళ్లు నిర్ణయించుకుంటారు.

తులసీదాసు భక్తి విశ్వాసాలను గురించి వాళ్లు అవహేళన చేస్తూ మాట్లాడుతారు. భగవంతుడు ఉన్నాడని తులసీదాసు చెప్పడమే కాకుండా, ఆ సమయంలో అక్కడున్న నంది విగ్రహంలో ఆయన కదలిక తీసుకువస్తాడు. అంతే ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్లు ఆశ్చర్యానికి లోనవుతారు. ఈ విషయంలో తులసీదాసును రెచ్చగొడితే తమకి కలిగే నష్టమే ఎక్కువని గ్రహించి అక్కడి నుంచి వెనుదిరుగుతారు. అలా భగవంతుడు ఉన్నాడని నిరూపించిన భక్తాగ్రేసరులలో తులసీదాసు కూడా కనిపిస్తూ వుంటాడు. మనసుని మందిరంగా చేసుకున్నప్పుడు అందులో భగవంతుడు తప్పక కొలువుంటాడనే విశ్వాసానికి మరింత బలాన్ని చేకూర్చుతుంటాడు.


More Bhakti News