అదే ఈ పుణ్యతీర్థాల విశిష్టత !

మారుమూల ప్రాంతాలలోగల ప్రాచీన ఆలయాల నుంచి మహాపుణ్యక్షేత్రాల వరకూ దర్శిస్తూ వెళితే, చాలా ప్రదేశాల్లో సీతారాముల పేరు వినిపిస్తూ వుంటుంది. సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో అనేక ప్రాంతాల మీదుగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ నేపథ్యంలో రాముడు అనేక ప్రదేశాల్లో శివలింగాలను ప్రతిష్ఠిస్తూ ... పూజిస్తూ వెళ్లాడు.

అలా రాముడిచే ప్రతిష్ఠించబడిన శివుడు రామలింగేశ్వరుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. ఇక సీతారాముల పాద స్పర్శచే పవిత్రమైన ఆయా ప్రదేశాల్లోనూ రామాలయాలు నిర్మించబడ్డాయి. ఇలాంటి క్షేత్రాల్లో గల తీర్థాలు కూడా 'రామతీర్థం' అనీ ... 'సీతమ్మధార' అనీ ... రాములవారి బావి అనీ ... లక్ష్మణస్వామి గుండం అనే పేర్లతో పిలవబడుతుంటాయి.

వనవాస కాలంలో సీతారాములు నిర్జన ప్రదేశాల్లో ప్రయాణాన్ని కొనసాగిస్తూ వుండగా, కొన్నిచోట్ల వారికి దాహం వేసిందట. ఆ చుట్టుపక్కల నదులు .. చెరువులు ... బావుల వంటివి కనిపించకపోవడంతో, వాళ్లే జలధారలు సృష్టించారు. రామలక్ష్మణులు తమ బాణాలను నేలమీద ప్రయోగించడంతో ఆ ప్రదేశం నుంచి పాతాళగంగ పొంగినట్టు చెప్పబడుతోంది.

ఇలా రామలక్ష్మణులు బాణ ప్రయోగం చేయడం వలన కొన్ని చోట్ల జలాశయాలు ఏర్పడగా ... మరికొన్ని చోట్ల జలధారలు ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన గుండాలలో గల నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటడం ... ఎండలు ఎంత తీవ్రంగా వున్నా అవి ఎండకపోవడం ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. ఇక ఈ గుండాలలోని నీటిని తలపై చల్లుకున్నా ... తీర్థంగా స్వీకరించినా సమస్తపాపాలు పటాపంచలై పోతాయనీ, అనారోగ్యాలు దూరమవుతాయనీ ... శుభాలు చేకూరతాయని విశ్వసిస్తుంటారు. అందువలన ఇలాంటి తీర్థాలన్నీ కూడా మహిమాన్వితమైనవనేది ఆయా క్షేత్రాల స్థల పురాణాల్లో కనిపిస్తూ వుంటుంది.


More Bhakti News