భగవంతుడిని ఇలా సేవించాలి

భగవంతుడి ఆరాధనకు చాలామంది తొలి ప్రాధాన్యతను ఇస్తుంటారు. దేవుడిని పూజించిన తరువాతనే తమ దైనందిన కార్యక్రమాలను ఆరంభిస్తుంటారు. పూజ విషయంలో నియమనిష్టలను పాటిస్తూ వుంటారు. ఇంట్లో ఏ పిండివంటను తయారు చేసినా ముందుగా భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించి, ఆ తరువాత దానిని ప్రసాదంగా స్వీకరిస్తూ వుంటారు.

అయితే పూజ చేసిన ప్రతిసారి ఆయనకి తమ సమస్యలు చెప్పుకుంటూ వుంటారు. తమ ఎదుగుదలకి ఏమేం చేయాలనేది ఆయనకి చెప్పేస్తుంటారు. చిన్నకష్టమొచ్చినా దానిని తీర్చే భారాన్ని దేవుడిపై వేసేస్తుంటారు .. ప్రతి చిన్నపనిని ఆయనకి అప్పగించేస్తుంటారు. అలాంటప్పుడు నిరాశ ఎదురైతే అనునిత్యం పూజ చేస్తున్నా ఇలా ఎందుకు జరిగిందా అని బాధపడుతూ వుంటారు.

చిన్నచిన్న పనులకే తీరికలేదంటూ అసహనాన్ని ప్రదర్శించేవాళ్లు, అనునిత్యం విశ్వమనే ఈ కుటుంబాన్ని చూసుకుంటోన్న భగవంతుడు ఎంత తీరికలేకుండా ఉంటాడో కదా ! అనే ఆలోచన చేయాలి. కొంతమంది భక్తులకు భగవంతుడు పిలిస్తే పలికేవాడు. అలాంటివారికి కూడా ఒక్కోసారి నిరాశ తప్పలేదు.

ఆ సమయంలో ఆయన ఏ భక్తుడిని ఆదుకోవడానికి వెళ్లాడోనని వాళ్లు అనుకున్నారేగాని అలగలేదు. స్వామి ఎదురుగానే వున్నాడు కదా అని భోగభాగ్యాలు కోరలేదు ... తమ బాధ్యతలను ఆయనకి అప్పగించనూ లేదు. ఎన్ని కష్టాలు ఎదురవుతూ వున్నా ... ఎన్ని బాధలు పడుతూ వున్నా స్వామి సేవలో లోపం జరగకుండా చూసుకున్నారే గాని, మరి వేటిని గురించీ ఆలోచించలేదు.

ఇది అందరికీ సాధ్యం కాదనుకునే వారు, తమ చేతుల్లో ఉన్నంత వరకూ ... తమకి సాధ్యమైనంత వరకూ కార్యసాధనకి ప్రయత్నించాలి. తమ చెయ్యి దాటిపోయిన సమయంలో మాత్రమే భగవంతుడి పాదాలను ఆశ్రయించాలి. చెబితేనే భగవంతుడికి తెలుస్తుంది ... లేదంటే పట్టించుకోడు అనుకోవడం అమాయకత్వమే అవుతుంది.

నిస్వార్థంతో భగవంతుడిని ఆరాధిస్తూ ... అంకితభావంతో సేవిస్తూ వెళుతుంటే అంతా ఆయనే చూసుకుంటాడు. తన భక్తుల పరిస్థితి ఏవిటో ... ఏ కష్టాన్ని వాళ్లు ఎంతవరకూ ఎదుర్కొన గలుగుతారనేది ఆయనకి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో పిలవకపోయినా ఆయన వస్తూనే ఉంటాడు. అడగకపోయినా సాయం చేస్తూనే వుంటాడు.


More Bhakti News