దర్శనమిచ్చి ఆవిర్భవించిన సుబ్రహ్మణ్యుడు

సుబ్రహ్మణ్యస్వామి కొలువైన క్షేత్రాలు ఎంతో శక్తిమంతమైనవిగా ... మరెంతో మహిమాన్వితమైనవిగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి విశిష్టతను సొంతం చేసుకున్న క్షేత్రంగా 'శింగరాయపాలెం' కనిపిస్తుంది. కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలంలో ఈ క్షేత్రం అలరారుతోంది. స్వామివారు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన తీరు, ఆ స్వామి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వున్నాడనే విషయాన్ని స్పష్టం చేస్తూ వుంటుంది.

చాలాకాలం క్రితం ఈ ప్రదేశంలో దివ్యమైన తేజస్సును కలిగిన ఒక సర్పం ఒక భక్తుడికి కనిపించిందట. మిగతా సర్పాలకి భిన్నంగా ఈ సర్పం వుండటం ... అది చిత్రంగా ప్రవర్తించడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ సర్పం పొడవు .. అది పడగ విప్పి ఆడినతీరు ఆయన కనులముందే కదలాడసాగింది. ఆ సర్పం తనకి ఏదో చెప్పాలనుకుంటోందనీ, అయితే అదేమిటనేది తాను అర్థంచేసుకోలేక పోతున్నాననే విషయం మాత్రం ఆయన గ్రహించాడు.

ఆ రాత్రి స్వప్నంలో అతనికి సుబ్రహ్మణ్యస్వామి కనిపించి, తాను ఆ ప్రదేశంలో ఆవిర్భవించానని చెప్పాడట. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియపరిచి, ఇక మీదట అందరూ దర్శించుకునేలా ఏర్పాట్లు చేయమని సెలవిస్తాడు. తన దర్శనం చేసుకున్నవారికి ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి అదృశ్యమవుతాడు.

మరునాడు ఉదయాన్నే ఆ భక్తుడు ఈ విషయాన్ని మిగతావారికి తెలియజేస్తాడు. ఆ రోజు నుంచే ఇక్కడ పూజలు ఆరంభ్యమయ్యేలా చేస్తాడు. ఆ తరువాత ఇక్కడ స్వామివారు చూపిస్తూ వచ్చిన మహిమల కారణంగా భక్తులలో విశ్వాసం మరింతగా బలపడుతూ వచ్చింది. అదే స్థాయిలో ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. స్వామివారు ఎంతగా సత్యాన్ని చూపిస్తాడనే విషయం ఇక్కడ మొక్కుబడులు చెల్లించుకునే భక్తులను చూస్తే తెలిసిపోతుంది.

ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన నాగదోషం తొలగిపోవడమే కాకుండా, మనోభీష్టం తప్పక నెరవేరుతుందని భక్తులు బలంగా చెబుతుంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఆ స్వామిని దర్శించి .. పాలు - పండ్లు నైవేద్యంగా సమర్పించి ఆశీస్సులు అందుకుంటూ వుంటారు. ఆ స్వామి అనుగ్రహంతో ఆశించిన ఫలితాలను పొందుతుంటారు.


More Bhakti News