కాకి రూపంలో జీవుడు

సమైక్యతలోని గొప్పతనాన్ని సంఘానికి చాటిచెప్పే పక్షి కాకి. ఇది శనేశ్వరుడి వాహనం గనుక, దాని కదలికలను ప్రజలు ఓ కంట గమనిస్తూనే వుంటారు ... ఆచార వ్యవహారాల దృష్ట్యా వాటిని పట్టించుకుంటూనే వుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో కొందరు ... కాకిలా కలకాలం బతకడం కంటే, హంసలా ఆరునెలలు బతకడం మేలు అని అంటూ వుంటారు.

నిజానికి హంస కన్నా కాకియే మొదటి నుంచి కూడా మనుషులకు దగ్గరగా ఉంటూ వచ్చింది. ఇంటిపైనో ... వాకిట్లోనో వాలి కాకి అరిస్తే చుట్టాలు వస్తారనే విశ్వాసం చాలామందిలో కనిపిస్తూ వుంటుంది. ఇక చనిపోయిన తమ పూర్వీకులు కాకి రూపంలోనే తిరుగుతూ ఉంటారనే ఆచారం ప్రాచీన కాలం నుంచి వుంది. ఈ కారణంగానే కర్మకాండలలో భాగంగా కాకులకు అన్నం పెడుతుంటారు.

ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారనీ, లేకపోతే వారికి ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువలన అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ వుంటారు. ఆ కోరిక ఏదో తెలుసుకుని దానిని తీర్చడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక ఈ భూమి మీద ఆస్తులు ... అనుబంధాలు శాశ్వతం "కావు ... కావు''అనే విషయాన్ని అనుక్షణం మానవులకు గుర్తుచేస్తూ, వారిని ముక్తి మార్గం వైపు నడిపించడంలో కాకి ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పక తప్పదు.


More Bhakti News