మంచివాళ్లకి మంచిరోజులు రాకుండా వుండవు

పగలు తరువాత వచ్చే రాత్రి ... అమావాస్య తరువాత వచ్చే పౌర్ణమి, కష్టాల తరువాత మంచిరోజులు వస్తాయనే విషయాన్ని స్పష్టం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే .. కష్టాలు కలకాలం వుండవు, మంచివాళ్లకి వచ్చిన కష్టాలు మబ్బుతెప్పల్లా కొట్టుకుపోతాయనే పెద్దల మాటలు కూడా ఆయా సందర్భాల్లో వినిపిస్తుంటాయి. ఇందుకు ఉదాహరణగా మనకి నలదమయంతుల కథ కనిపిస్తుంది.

నిషధ దేశపు రాజైన 'నలుడు' దానధర్మాలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకుంటూ వుంటాడు. సౌందర్యవతి అయిన ఆయన భార్య దమయంతి మహాపతివ్రత. కలిపురుషుడి ప్రభావం చేత 'పుష్కరుడు' అనే దాయాదితో జూదమాడిన నలుడు సమస్తాన్ని కోల్పోతాడు. ఆ సమయంలో పుష్కరుడు కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ, నలదమయంతులకు ఆ రాజ్య ప్రజల ఆదరాభిమానాలు లభించకుండా చేస్తాడు.

అడవులపాలైన ఆ దంపతులు ఆ తరువాత ఒకరికి ఒకరు దూరమై అనేక కష్టాల అనంతరం తిరిగి కలుసుకుంటారు. కలిపురుషుడు తొలగిపోయాడని తెలుసుకున్న నలుడు, తిరిగి పుష్కరుడితో జూదమాడి గతంలో తాను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి పొందుతాడు. మంచివాళ్లకి మంచిరోజులు వస్తాయనే సత్యం ఈ విషయంలోనూ నిలుస్తుంది.

గతంలో తాను ఓడిపోయినప్పుడు పుష్కరుడు తమని అవమానపరచిన సంఘటన ... కఠినంగా వ్యవహరించిన తీరు నలమహారాజు కళ్లముందు కదలాడతాయి. అయినా పుష్కరుడిని శిక్షించకుండా క్షమించి పంపించివేస్తాడు. మన్నించడమనేది మహాపురుషుల సహజ లక్షణమని నిరూపిస్తాడు.


More Bhakti News