సేవకి తగిన ఫలితం లభిస్తుంది

సేవ అనే రెండు అక్షరాలు ఎంతో పవిత్రమైనవి ... మరెంతో శక్తిమంతమైనవి. నిస్వార్థమైన ... అంకితభావంతో కూడుకున్న సేవ వలన లభించని పుణ్యం లేదు. సేవ అనేది ఎవరికి చేసినా అది వృధాపోదు. ఎక్కడ వున్నా ... ఎంతకాలమైనా దాని ఫలితం వెతుక్కుంటూ వస్తుంది. ఇక భగవంతుడికీ ... గురువుకీ ... తల్లిదండ్రులకి చేసే సేవ వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

ఇక వీటిలో గురుసేవ కొంచెం కష్టమైనదనే చెప్పుకోవాలి. ఎందుకంటే గురువుకి సేవలు చేయడం అంతతేలికైన విషయం కాదు. అడుగడుగునా గురువుపెట్టే పరీక్షలను తట్టుకుని నిలబడాలి. ఎలాంటి పరిస్థితుల్లోను గురువు పట్ల తనకి గల విశ్వాసం నుంచి జారిపోకుండా చూసుకోవాలి. అప్పుడే గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం జరుగుతుంది.

అలా గురువు యొక్క కటాక్షాన్ని పొందినవాళ్లలో 'బాలప్ప' ఒకడుగా కనిపిస్తాడు. అక్కల్ కోట స్వామి శిష్యులలో బాలప్ప ముందువరుసలో కనిపిస్తాడు. సుధీర్గకాలంపాటు బాలప్ప సేవలను స్వీకరించిన అక్కల్ కోటస్వామి, తన నోట్లో నుంచి 'ఆత్మపాదుకలు' తీసి తన గుర్తుగా ఆయనకి అందజేసి అనుగ్రహిస్తాడు. ఇక వీరబ్రహ్మేంద్రస్వామి శిష్యుడుగా 'సిద్ధయ్య' చూపిన భక్తి విశ్వాసాలు అందరికీ ఆదర్శనీయమని చెప్పొచ్చు.

అనునిత్యం ... అనుక్షణం గురువు సేవలో తరించడానికే సిద్ధయ్య ఇష్టపడతాడు. గురువు ఎడబాటును భరించలేని ఆయన ఆత్మత్యాగానికి సిద్ధపడతాడు. అతని సేవలకు ... ప్రేమానురాగాలకు సంతృప్తి చెందిన స్వామి, ఆయనకి తన పాదుకలు ... కమండలం ... ఉంగరం ప్రసాదిస్తాడు. ఇక బాబా శిరిడీలో ప్రవేశించిన దగ్గర నుంచి ఆయనని కంటికి రెప్పలా చూసుకున్న సేవకురాలిగా 'లక్ష్మీబాయి షిండే' కనిపిస్తుంది.

బాబా ఎక్కడెక్కడో తిరుగుతూ వుంటే ఆయనని వెతుక్కుంటూ వెళ్లి, ప్రేమానురాగాలతో పాలు - రొట్టె అందించిన పవిత్రమూర్తి ఆమె. ఏనాడూ బాబాను విసుక్కోకుండా, బిడ్డ ఆకలిని తీర్చిన తల్లిలా ఆమె సంతోషపడిపోయేది. అలాంటి లక్ష్మీబాయికి తన చివరి క్షణాల్లో బాబా 'తొమ్మిది నాణాలు' ప్రసాదించాడు. నవవిధ భక్తికి అది నిదర్శనమని చెబుతుంటారు. ఇలా గురువును సేవిస్తూ ఆయన అనుగ్రహానికి ఎంతోమంది పాత్రులయ్యారు ... తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు.


More Bhakti News