తలనీలాలు

కష్టాలు ... కన్నీళ్లు ... మానవుల జీవితాలను ఎప్పుడూ పలకరిస్తూనే వుంటాయి ... పరిగెత్తిస్తూనే వుంటాయి. ఆపదలు ఎదురైనప్పుడు ఇక అందరికీ ఆ దేవుడే దిక్కు. అందుకే వాటి నుంచి గట్టెక్కిస్తే తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటూ వుంటారు. ఇలా మొక్కుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా వుంటుంది కాబట్టి, ఆయా పుణ్యక్షేత్రాలలో తలనీలాలకు సంబంధించిన ఏర్పాట్లు భారీగా వుంటాయి.

అయితే ఈ తతంగమంతా కొందరికి ఆశ్చర్యం కలిగిస్తూ వుంటుంది. చక్కగా స్వామివారికి కానుకలుగా ఏవైనా సమర్పించకుండా, వెంట్రుకలు ఇస్తామని మొక్కుకోవడమేమిటని అనుకుంటూ వుంటారు. వెంట్రుకలు ఇవ్వడం వలన స్వామికి ఒరిగేదేముందని భావిస్తుంటారు. అయితే తలనీలాలు ఇవ్వడమనే ఆచారం వెనుక అసలైన అర్థం వుంది. సాధారణంగా జుట్టు అందానికి ... ఆకర్షణకి ప్రతీకగా కనబడుతుంది. ఆకర్షణ వ్యామోహానికి దారితీయడమే కాకుండా, అనుబంధాలను ... అందమైన జీవితాన్ని చిందరవందర చేస్తుంది.

జుట్టు లేకపోవడం వలన మనసులో ఎలాంటి వికారాలు కలగవు. కనుక నీతిబద్ధమైన ... నియమబద్ధమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక తల నీలాలు సమర్పించడమంటే, అహంకారాన్ని వదులుకున్నట్టుగా స్వామివారికి చెప్పడమే. అంతే కాకుండా దైవ దర్శన సమయంలో దైవం పై దృష్టి నిలపడం కోసం ... నిజమైన సౌందర్యం ఏదైనా వుందంటే అది నీదే స్వామి అనే ఉద్దేశాన్ని ప్రకటించడం కోసం తలనీలాలు ఇవ్వడం జరుగుతుంది.

ఇక పుణ్య క్షేత్రాలను దర్శించినప్పుడు, అక్కడ తలనీలాలు సమర్పించి స్నానం చేస్తే చర్మ సంబంధమైన వ్యాధుల బారి నుంచి బయట పడవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఈ కారణంగానే తలనీలాలు ఇవ్వడమనేది అనాదిగా ఆచారంగా వస్తోంది.


More Bhakti News