ఘనచరిత్రకు నిదర్శనమైన గణపతి

హంపి ... అనే రెండు అక్షరాల వెనుక ఆశ్చర్యచకితులనుచేసే అలనాటి చారిత్రక వైభవం కనిపిస్తుంది. అనిర్వచనీయమైన అనుభూతిని అందించే ఆధ్యాత్మిక సంపద దర్శనమిస్తుంది. ఈ రెండింటికీ సమానమైన ప్రాధాన్యతను ఇచ్చిన హంపీ, ఒకప్పుడు సిరిసంపదలతోను ... అనేక కళలతోను వెలుగొందిన ఆధారాలు వున్నాయి.

అలనాటి రాజులు సంగీత సాహిత్యాలతో పాటు ఆధ్యాత్మికతకు కూడా ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అందుకు నిదర్శనంగానే అడుగడుగునా ఇక్కడ అనేక ఆలయాలు కనిపిస్తుంటాయి. ప్రతి ఆలయం అద్భుతమైన శిల్పకళతో పాటు అరుదైన విశేషాలను సంతరించుకుని దర్శనమిస్తూ వుంటుంది. ప్రతి మందిరంలోను .. ఆలయంలోను దేవతామూర్తుల ప్రతిమలు భారీతనంతో కనిపిస్తుంటాయి. అలనాటి రాజుల భక్తిశ్రద్ధలకు నిదర్శనంగా అనిపిస్తుంటాయి.

అలా ఇక్కడ కొలువైన దేవతామూర్తులలో ఆవగింజ గణపతి - శనగగింజ గణపతి మరింత ప్రత్యేకతను ఆవిష్కరిస్తుంటారు. ఆ రంగు గల రాయితో మలచబడిన కారణంగా ఆవగింజ గణపతి ... శనగగింజ గణపతిగా పిలుస్తుంటారు. ఆవగింజ గణపతి ఆరుబయట మంటపంలోను ... శనగగింజ గణపతి ఆలయంలోను దర్శనమిస్తుంటారు. ఈ రెండు విగ్రహాలు చాలా ఎత్తును కలిగి ఉండటమే కాకుండా, సాక్షాత్తు వినాయకుడే ఎదురుగా ఆశీనుడై వున్నాడా ? అని సందేహం కలిగేంతగా జీవకళ ఉట్టిపడుతూ వుంటాయి.

తొలిపూజలందుకునే గణపతికి అలనాటివారు ఇచ్చిన ప్రాధాన్యతకు ... అలనాటి ఘనచరిత్రకు నిదర్శనంగా ఈ గణపతి విగ్రహాలు కనిపిస్తుంటాయి. ఒకప్పుడు సమస్త సంపదలకు ... సకల కళలకు నిలయమైన ప్రదేశంలో అడుగుపెట్టామనే ఆనందం, రాజులు .. కవిపండితులు ... మహాభక్తులు దర్శించుకున్న ఆలయాలను చూసే భాగ్యం లభించిందనే అనుభూతి ఈ క్షేత్రదర్శనం వలన లభిస్తుంది. అది మధురమైన మంత్రంలా మనోఫలకంపై కడవరకూ నిలిచిపోతుంది.


More Bhakti News