సీతాష్టమి పూజా ఫలితం

శివ ధనుస్సు విరిచిన శ్రీరాముడి మెడలో సీత వరమాల వేసింది. వేద మంత్రాల సాక్షిగా రాముడి వెంట ఏడడుగులు నడిచింది. అపురూపంగా ... అల్లారుముద్దుగా పెరిగిన సీత అత్తవారిల్లు అయోధ్య అయినందుకు పొంగిపోయింది. సూర్యవంశీకుల ఇంటికి కోడలిగా వెడుతున్నందుకు ఎంతగానో ఆనందించింది. సీతమ్మలేని మిథిలా నగరంలో ఉండలేమని అక్కడి ప్రజలు దిగాలు పడ్డారు. అసమాన పరాక్రమవంతుడైన రామయ్య చేతిలో ఆమెని పెట్టినందుకు సంతోషించారు.

కానీ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి, రాముడితో సీతమ్మ వనవాసానికి వెళ్లవలసి వస్తుంది. మేడలకి దూరమైనందుకు సీతమ్మ బాధపడలేదు. రాముడి నీడలో వుండే భాగ్యం లభించినందుకు సంతోషించింది. చలువరాతి మందిరాలు తప్ప మరేమీ తెలియని సీతమ్మ, కారడవులలో కాలి నడకన రాముడిని అనుసరించింది. దశరథుడు చనిపోయిన సమయంలో రాముడి మనసుకు ఆమె ఎంతో ఊరట కలిగించింది.

రావణుడు అపహరించుకుపోగా, రాముడు వచ్చేంత వరకూ పాతివ్రత్యం చేత తనని తాను రక్షించుకుంది. లంకా నగరానికి ముందుగా వచ్చిన హనుమంతుడు, తాను రాముడి సన్నిధికి తీసుకువెళతానంటే నిరాకరిస్తుంది. రాముడు వచ్చి రావణుడిపై విజయ శంఖాన్ని పూరించి తీసుకువెళ్లడమే క్షత్రియ ధర్మమని చెబుతుంది. సీత పవిత్రత గురించి రాముడికి తెలిసినా, లోకం నింద చేయకూడదనే ఉద్దేశంతో అగ్నిప్రవేశం చేయమనగానే చేస్తుంది.

ఎలాంటి పరిస్థితుల్లోను ఒక్కమాట వలన కూడా రామచంద్రుడి మనసు నొప్పించని మహాఇల్లాలు సీత. అందుకే ఆమె లక్ష్మీ స్వరూపంగానే కాదు, మహిళాలోకానికి ఆదర్శమూర్తిగాను నిలిచింది. అలాంటి సీత 'ఫాల్గుణ బహుళ అష్టమి' రోజున జనకమహారాజుకి నాగేటిచాలులో పసికందుగా లభించింది. అందుకే ఈ రోజుని 'సీతాష్టమి' గా పిలుచుకుంటూ వుంటారు.

ఈ రోజున ఆ తల్లిని భక్తిశ్రద్ధలతో స్మరించుకోవాలని చెప్పబడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున ప్రదోష కాలంలో పెద్ద సంఖ్యలో దీపాలు వెలిగించి 'దీపోత్సవం' జరుపుతుంటారు. ఈ రోజున సీతారాముల ఆలయాలను దర్శించడం వలన ... పూజించడం వలన ... రామాయణ మహాకావ్యాన్ని పఠించడం వలన ... వినడం వలన కష్టాలు తొలగిపోయి శుభాలు చేకూరతాయని చెప్పబడుతోంది.


More Bhakti News