కృష్ణుడు స్త్రీ రూపాన్ని ఎందుకు ధరించాడు ?

ప్రేమ ... అనురాగం ... ఆరాధన అనే మాటలు వినిపించినప్పుడు అందరికీ గుర్తుకు వచ్చే పేరు 'రాధ'. కృష్ణుడిపై ఆమెకిగల ప్రేమ .. ఆయనపట్ల ఆమెకిగల అనురాగం ... చూపిన ఆరాధనను మరొకరితో పోల్చడం సాధ్యం కాదు. నిజమైన ప్రేమకి నిర్వచనం రాధ ... అసలైన అనురాగానికి ఆనవాలు రాధ.

వృషభానుడి కుమార్తె అయిన రాధ ... మధురభక్తికి ప్రతీక. కృష్ణుడు వచ్చినది మొదలు ఆయనతో ఆటపాటల్లో తేలిపోతూ వుండేది. హఠాత్తుగా మాయమైన ఆయన తిరిగి వచ్చేవరకూ ఆ జ్ఞాపకాల్లోకి జారిపోతూ వుండేది. వుంటే కృష్ణుడి తోడులో ... లేదంటే ఆయన జ్ఞాపకాల నీడలో సేదదీరడం తప్ప రాధకు మరో ధ్యాస వుండేది కాదు.

అలాంటి రాధ ప్రేమను పరీక్షించాలని కృష్ణుడు అనుకుంటాడు. 'గోపదేవి' అనే పేరుతో గోపిక వేషం కడతాడు. తాను గోవర్ధన గిరి వైపు వెళ్లినప్పుడు కృష్ణుడు తన వెంట పడ్డాడనీ, పెళ్లి చేసుకోమని చెప్పి వత్తిడి చేశాడని రాధతో గోపదేవి చెబుతుంది. కృష్ణుడి ధోరణి తనకి ఎంతమాత్రం నచ్చలేదనీ, ఆయన వ్యవహారాన్ని వాళ్ల ఇంట్లో చెబుతానని అంటుంది. తాను అందగాడినని మిడిసిపడుతోన్న కృష్ణుడి ప్రేమను తిరస్కరించి తగిన అవమానం చేశానని అంటుంది.

ఆ మాటలు తట్టుకోలేనట్టుగా రాధ కన్నీళ్ల పర్యంతమవుతుంది. వెన్నవంటి కృష్ణుడి మనసును అర్థం చేసుకోలేకపోవడం వల్లనే ఆమె అంత కఠినంగా మాట్లాడగలుగుతోందని అంటుంది. గోపాలుడిగా కృష్ణుడు ప్రదర్శించే లీలావిశేషాల వెనుక దాగిన పరమార్థం ఆమెకి తెలియదంటూ ఆవేదన చెందుతుంది. కృష్ణుడి ప్రేమానురాగాలను తిరస్కరించడమంటే జీవితాన్ని తరింపజేసుకునే అవకాశాన్ని జారవిడుచుకోవడమేనని అంటుంది. ఆయన అనుగ్రహానికి నోచుకునే అవకాశం పూర్వజన్మ సుకృతం వలన గాని లభించదని చెబుతుంది.

రాధ మనసులో తనకిగల స్థానం ఎంత గొప్పదో కృష్ణుడికి అర్థమైపోతుంది. దాంతో ఆయన గోపదేవి రూపాన్ని విడిచి నిజరూపంలో రాధ ఎదుట నిలుస్తాడు. ఆశ్చర్యపోయిన రాధ ఆనందబాష్పాలను తుడుచుకుంటూ కృష్ణుడిని ఆలింగనం చేసుకుంటుంది. ప్రపంచంలోని ప్రేమంతా రాధ రూపంలో తన సన్నిధికి చేరినట్టుగా కృష్ణుడు ఆమెని అక్కున చేర్చుకుంటాడు.


More Bhakti News